జమ్ము : జమ్ములో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో ఉదయం 8.30 గంటల వరకు నగరంలో 66 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జమ్ము-కశ్మీర్‌లో ఇదే అత్యధిక వర్షపాతం. ఉధంపూర్‌లో 56 మి.మీ., పూంచ్‌లో 45 మి.మీ., కోకర్‌నాగ్‌లో 42 మి.మీ., ఖాజీగుండ్‌లో 32.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో జమ్ము నగరంలో సాధారణ జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఆదివారం కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల సమయంలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. షాహీదీ చౌక్‌లో ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ఓ పాత, ఖాళీగా ఉన్న ఇల్లు కూలిపోయింది. కొద్ది నెలల క్రితమే భవనంలో పగుళ్లు ఏర్పడటంతో ఆ నివాసంలోని కుటుంబం అద్దె ఇంటికి మారింది. ఇంట్లోని సామగ్రి దెబ్బతిన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తలాబ్ టిల్లో, భగవతి నగర్, కృష్ణానగర్, కెనాల్ రోడ్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. పలు ఇళ్లు, దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది.
జమ్ము-పూంచ్ జాతీయ రహదారిపై భగవతి నగర్ సమీపంలో, జమ్ము-ఆర్‌ఎస్ పురా రహదారిపై కుల్లియన్ వద్ద, బజాల్తా రోడ్డుపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు రాగి నాలా వద్ద కొండచరియలు విరిగిపడటంతో జమ్ము-కిష్త్వార్ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశామని అన్నారు. రహదారిని పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. డోడా జిల్లాలోని థాత్రీ ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చినప్పటికీ ఎలాంటి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాంబన్ జిల్లా యంత్రాంగం సూచించింది. ఎగువ ప్రాంతాలు, నదులు, వాగులు, ఇతర జల వనరుల సమీపంలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని సూచించింది. వర్షాల కారణంగా చెనాబ్ నదిలో నీటిమట్టం కూడా పెరిగింది.








కామెంట్‌లు (0)