మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ముంబయిని వీడని భారీ వర్షాలు

06 జులై, 2026

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 10:58 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రేపటి వరకూ రెడ్‌ అలర్ట్‌

- నేడు నాసిక్‌‌లో మేఘ విస్పోటనం?

- ఐఎండి హెచ్చరిక

- శాసనసభ సమావేశాలు వాయిదా

ముంబయి : దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. సోమవారం కూడా ముంబయిలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నెల 8 వరకూ భారత వాతావరణ శాఖ (ఐఎండి) రెడ్‌ అలర్ట్‌ ‌ప్రకటించింది. మంగళవారం నాసిక్‌‌లో మేఘ విస్పోటనం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాలు, రెడ్‌ అలర్ట్‌ ‌జారీ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారం రాష్ట్ర విపత్తు నిర్వహణ కంట్రోల్‌ ‌రూమ్‌‌లో పరిస్థితిని సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. కొండచరియలు విరిగిపడటం, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, రోడ్లపైకి రాకూడదని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల దృష్ట్యా, ముంయిలోని ప్రైవేట్ కార్యాలయాలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయడానికి అనుమతించాలని కోరారు. అత్యవసరం కాని ప్రభుత్వ కార్యాలయాలు హాఫ్‌ ‌డే మాత్రమే పని చేయాలని సూచించారు.

రైళ్లు, విమాన సర్వీసులకు అంతరాయం..

అలాగే, ముంబయి, పరిసర ప్రాంతాలలో భారీ వర్షం, బలమైన గాలులు నేపథ్యంలో సోమవారం జరగాల్సిన మహారాష్ట్ర శాసనసభ సమావేశాలను మంగళవారానికి వాయిదా వేశారు. భారీ వర్షాల కారణంగా సోమవారం ముంబయి ఎయిర్‌‌పోర్ట్‌‌లో కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ఐదు విమానాలను దారి మళ్లీంచాల్సి వచ్చింది. రైళ్ల రాకపోకలకు కూడా ఇబ్బందులు కలిగాయి. అనేక సెక్షన్లలో పట్టాలపై నీరు నిలిచిపోవడంతో 40కి పైగా రైలు సర్వీసులను రద్దుచేయడం, దారి మళ్లించడం జరిగింది. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కాగా, సోమవారం ముంబయితో పాటు థానే, రాయగడ్‌ ‌జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసాయి. ఈ జిల్లాలకు కూడా ఐఎండి సోమవారం రెడ్‌ అలర్ట్‌ ‌జారీ చేసింది. పూణే నగరంలో సోమవారం భారీ వర్షం కురింది. దీంతో నగరంలోని ఇంద్రాయణి నదిపై ఉన్న నాలుగు వంతెనలు నీట మునిగాయి.

ఇతర రాష్ర్టాల్లోనూ ....

వరుసగా మూడవ రోజైన సోమవారం కూడా ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి సోమవారం హెచ్చరించింది. రాష్ట్రంలోని శివనాథ్, ఖరున్ తో సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి ఛత్తీస్‌‌గఢ్‌‌లో కురుస్తున్న వర్షాల కారణంగా రాయ్‌పూర్, దుర్గ్, భిలాయ్, ధమ్తరి, గరియాబంద్ తదితర నగరాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. పలు నివాస ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. సోమవారం రాజస్థాన్‌‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. సికార్ జిల్లాలోని శ్రీమాధోపూర్‌లో అత్యధికంగా 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. జైపూర్‌లో 40 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కాగా, ఉదయ్‌పూర్, ఝలావార్, బారన్, సిరోహి.. జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదైంది. సోమవారం సాయంత్రానికి కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తూనే ఉన్నాయి. రాబోయే ఏడు రోజుల నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉండి, భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండి హెచ్చరించింది. ఒడిషాలోనూ సోమవారం కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కొనసాగాయి. దీంతో కటక్, కంధమాల్, సంబల్పూర్, సోన్‌పూర్, బర్గఢ్ జిల్లాల్లో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్