- రూ.10 వేల కోట్లతో ఎస్‌ఎంఇ గ్రోత్ ఫండ్ !
ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం
రవాణా, లాజిస్టిక్స్ కోసం సమగ్ర సాధికార సంస్థ ఏర్పాటు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎస్‌ఎంఇ) దీర్ఘకాలిక మూలధనం అందించేందుకు రూ.10 వేల కోట్లతో ఎస్‌ఎంఇ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దేశంలో రవాణా, లాజిస్టిక్స్ రంగాల ప్రణాళిక, పర్యవేక్షణ, ప్రాజెక్టుల పరిశీలన కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ (ఐటిఎల్ఎ)ని ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. ఎస్‌ఎంఇ గ్రోత్ ఫండ్ గురించి తొలిసారిగా ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. ఇందులో ఈక్విటీ మద్దతు ఇవ్వడం, ద్రవ్యపరమైన చర్యలు, వృత్తిపరమైన తోడ్పాటునందించడం వుంటాయి. రూ.500 కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయంతో చేపట్టే కేంద్ర ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఐటిఎల్ఎ సాంకేతిక మదింపు నిర్వహించనుంది. సమగ్ర రవాణా, లాజిస్టిక్స్ ప్రణాళికలు, పరిశోధన, ప్రాజెక్టు పరిశీలన, పర్యవేక్షణ, విధానపరమైన మద్దతు, డేటా విశ్లేషణ వంటి కార్యకలాపాలకు ఐటిఎల్‌ఎ సుప్రీం సంస్థగా వ్యవహరిస్తుంది. దేశంలోని రవాణా సదుపాయాల సమర్ధతను, సుస్థిరతను, సామర్ధ్యాలను ఐటిఎల్‌ఎ పెంపొందిస్తుందని అధికారిక ప్రకటన పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 25 ఏళ్ల పాటు నిరాటంకంగా నాయకత్వ బాధ్యతలను పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయనను అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రివర్గ తీర్మానంలో పది కీలక అంశాలు ఉన్నాయి








కామెంట్‌లు (0)