ఎస్‌బిఐ ఛైర్మన్ సిఎస్ శెట్టి వెల్లడి
న్యూఢిల్లీ : ప్రభుత్వ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) గృహ రుణాల విభాగంలో చారిత్రాత్మక మైలురాయికి చేరువవుతోంది. వినియోగదారుల నుంచి ఉన్న బలమైన డిమాండ్ కారణంగా ప్రస్తుత త్రైమాసికంలోనే బ్యాంక్ గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ.10 లక్షల కోట్ల మార్కును దాటనుందని ఎస్‌బిఐ ఛైర్మన్ సిఎస్ శెట్టి వెల్లడించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలోనే రూ. 9 లక్షల కోట్ల మార్కును దాటిన ఎస్‌బిఐ, ప్రస్తుతం దేశీయ గృహ రుణ మార్కెట్‌లో ఏకంగా 28 శాతం వాటాను కలిగి ఉండి అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 460కి పైగా హోమ్ లోన్ ప్రాసెసింగ్ సెంటర్ల ద్వారా సేవలను సులభతరం చేయడం, పారదర్శకమైన వడ్డీ రేట్లు, బిల్డర్ల ప్రాజెక్టుల విషయంలో నిర్వహించే పక్కా లీగల్ పరిశీలన (డ్యూ డిలిజెన్స్) వల్ల వినియోగదారులు ఎస్‌బిఐని ఎక్కువగా విశ్వసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
గృహ రుణాలను కేవలం ఒక బ్యాంకింగ్ ఉత్పాదనగా మాత్రమే చూడకూడదని, రియల్ ఎస్టేట్ రంగానికి 200కి పైగా అనుబంధ రంగాలు ముడిపడి ఉన్నందున ఇది దేశ ఆర్థిక వ్యవస్థాభివృద్ధిలో అత్యంత కీలకమైన భాగమని సిఎస్ శెట్టి స్పష్టం చేశారు. అలాగే దేశీయంగా రూ. 30 లక్షల కోట్లకు పైగా ఉన్న గృహ రుణాల సెక్యూరిటైజేషన్‌పై ఆయన మాట్లాడారు. విదేశాలతో పోలిస్తే భారతీయ మార్కెట్‌లో హోమ్ లోన్ ఆస్తుల ద్రవ్యత (లిక్విడిటీ) తక్కువగా ఉందన్నారు. బ్యాంకుల వద్ద ఉన్న ఈ మూలధనాన్ని సమర్థవంతంగా పునర్వియోగించి రుణ సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా నాన్ బ్యాంకింగ్ రంగం భాగస్వామ్యంతో సెక్టోరియల్ సెక్యూరిటైజేషన్ విధానాలను వేగవంతం చేస్తున్నామని, ఈ ఏడాదే ఒక కీలక లావాదేవీని పూర్తి చేయాలని యోచిస్తున్నామని తెలిపారు.








కామెంట్‌లు (0)