గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జంతర్‌మంతర్‌పై పూర్తి నిషేధం ఎలా విధిస్తారు : ఢిల్లీ హైకోర్టు

1 గంట క్రితం

Delhi HC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 02:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : జంతర్‌మంతర్‌లో నిరసనలపై పూర్తి నిషేధం ఎలా విధిస్తారని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. కొత్త యుజిసి నిబంధనలకు వ్యతిరేకంగా జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేపట్టేందుకు కర్ణి సేనకు అనుమతి నిరాకరించడంపై కోర్టు ఈవ్యాఖ్యలు చేసింది. నిరసనలపై ఈ విధంగా పూర్తిస్థాయి నిషేధం ఎలా విధిస్తారని ప్రశ్నించింది. జంతర్‌ మంతర్‌ సున్నితమైన ప్రాంతమని పేర్కొంటూ పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని కోర్టు తప్పుబట్టింది. యుజిసి నిబంధనలు, 2026కు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 20న శాంతియుత నిరసన చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కర్ణి సేన నేత రాజ్‌ శెఖావత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. నిరసనకు తొలుత అనుమతి ఇచ్చిన పోలీసులు ఆ తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందనే కారణంతో అనుమతి నిరాకరించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం పోలీసుల తీరుపై ప్రశ్నలు సంధించింది. నిరసనకారులపై తగిన ఆంక్షలు, షరతులు విధించి అనుమతి ఇవ్వవచ్చని గత విచారణలోనే స్పష్టం చేసినట్లు తెలిపింది. నిరసన కొన్ని గంటలు మాత్రమే జరుగుతుందని, పాల్గొనేవారు అక్కడి నుంచి ముందుకు వెళ్లరని పేర్కొంటూ అనుమతి నిరాకరించడాన్ని ప్రశ్నించింది. నిరసనలను నియంత్రించేందుకు సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు, శాశ్వత ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మ తెలిపారు. జంతర్‌ మంతర్‌ సున్నితమైన ప్రాంతమని, కర్ణి సేనను మాత్రమే కాకుండా ఇతరులకు కూడా అనుమతులు నిరాకరించినట్లు వివరించారు. సోషల్‌ మీడియా ప్రచారం, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం కారణంగా పరిస్థితులు అదుపు తప్పవచ్చని అధికారులు భావిస్తున్నట్లు తెలిపారు. జంతర్‌ మంతర్‌ కాకుండా మరో ప్రదేశాన్ని సూచించి, కొన్ని షరతులతో నిరసనకు అనుమతి ఇవ్వవచ్చా అని కోర్టు ప్రశ్నించింది. నిరసనలపై పూర్తిస్థాయి నిషేధం విధించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సూచించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్