- జార్ఖండ్‌లో విద్యార్థి ఆందోళనలో ఉద్రిక్తత
రాంచి : విద్యార్థి సంఘ నాయకురాలు నేహా బోరాపై దుండగుడు సిరా దాడి చేశాడు. జార్ఖండ్‌లో జెపిఎస్‌సి నియామాకాల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా రాంచిలో శుక్రవారం ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఐఎస్‌ఎ) ర్యాలీ నిర్వహించింది. ర్యాలీ ప్రారంభంకాగానే గుర్తు తెలియని దుండగుడు నేహాపై సిరా విసిరాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె యాంటీ నేషనల్, నేను దేనికైనా సిద్ధం అంటూ ఆ దుండగుడు నినాదాలు చేశాడు. ఈ దాడిపై స్పందించిన నేహా బోరా, ‘‘ఢిల్లిలో మాపై బాష్పవాయు గోళాలు ప్రయోగించారు, పెల్లెట్ గన్‌లు కూడా వాడారు. అప్పుడే మేం భయపడలేదు, ఇక ఈ మామూలు సిరా మమ్మల్ని ఏం చేయగలదు?’’ అని అన్నారు. అంతేకాకుండా, ‘‘జార్ఖండ్‌లో, దేశవ్యాప్తంగా జరిగే ప్రతి పరీక్షను ప్రభుత్వ సంస్థలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించాలి. ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడల్లా బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలపైకి నెట్టేయడం సరికాదు. సంబంధిత ప్రభుత్వ అధికారులే జవాబుదారీగా ఉండాలి. అక్రమాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవస్థలోని ప్రైవేట్ ఏజెన్సీలన్నింటినీ తొలగించాలని మేం డిమాండ్ చేస్తున్నాం.’’ అని ఆమె పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)