- జునైద్‌కు పోలీసుల వేధింపులు
- సుర్జీత్ భవన్‌లో జునైద్‌కు స్వాగతం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జంతర్ మంతర్‌లో ఆందోళన చేసిన విద్యార్థులకు భోజనం అందించడమే తప్పా? అని మహమ్మద్ జునైద్ ఆవేదన వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థి ఆందోళనలో చురుకుగా పాల్గొన్నందుకు ఢిల్లీ పోలీసుల వేధింపులకు గురైన మహమ్మద్ జునైద్ శనివారం హెచ్‌కెఎస్ సుర్జీత్ భవన్‌కు చేరుకున్నారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్ అరుణ్‌కుమార్, రాజ్యసభ ఎంపి వి శివదాసన్, ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి ఐషి ఘోష్, రాష్ట్ర అధ్యక్షులు సూరజ్ ఎలామన్, సహాయ కార్యదర్శి మెహినా ఫాతిమా, రాష్ట్ర కమిటీ సభ్యులు అనిల్ సేతుమాధవన్, సఖి జునైద్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సఫ్దర్ హష్మీపై సుధాన్‌షా దేశ్‌పాండే రచించిన ‘హల్లా బోల్’ పుస్తకాన్ని జునైద్‌కు శివదాసన్, ఐషి అందజేశారు.
కళ్లకు గంతలు కట్టి ఉత్తరాఖండ్ తీసుకెళ్లారు : జునైద్
జంతర్ మంతర్ వద్ద నిరవధిక ఆందోళన ప్రారంభమైనప్పటి నుండి విద్యార్థులకు ఆహారం పంపిణీ చేసినందుకు జునైద్‌ను పోలీసులు వేధించారు. ఎటువంటి కారణం లేకుండా జునైద్‌ను, ఆయన కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. తనను రోజంతా జైలులో ఉంచారని నాయకులకు జునైద్ చెప్పారు. విద్యార్థులకు ఆహారం అందించడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు తనను అడిగారని అన్నారు. పోలీసులు తన కళ్లకు గంతలు కట్టి ఉత్తరాఖండ్‌కు తీసుకెళ్లి విడిచిపెట్టారని అన్నారు. సుమారు ఆరు గంటల పాటు కళ్లకు గంతలతోనే ప్రయాణించాల్సి వచ్చిందని, యుపిలోని ఘజియాబాద్‌కు చెందిన తనను, తన కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని బెదిరించారని వివరించారు. కుక్క కాటుకు గురై ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా జునైద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జునైద్ తనకు తెలిసిన వారి నుంచి విరాళాలు సేకరించి విద్యార్థులకు ఆహారం, నీరు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)