శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లో సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (జెకెఎస్‌ఎస్‌బి) పేపర్ లీక్ వ్యవహారంలో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) ప్రభుత్వానికి సంబంధం ఉందంటూ కేంద్రమంది జె.పి.నడ్డా చేసిన వ్యాఖ్యలను సిఎం ఒమర్ అబ్దుల్లా తోసిపుచ్చారు. 2024లో తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందే.. 2022లో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి)పాలనలో ఆ ఘటన జరిగిందని అన్నారు. ఎస్‌ఎస్‌బి పేపర్‌లీక్ కుంభకోణంలో ఎన్‌సి, కాంగ్రెస్ ప్రభుత్వాలకు సంబంధం ఉందని, అందుకే మౌనంగా ఉ న్నాయని బుధవారం మీడియా సమావేశంలో జె.పి.నడ్డా ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఒమర్ అబ్దుల్లా గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. జమ్ముకాశ్మీర్‌లో ఎస్‌ఎస్‌బి పేపర్‌లీకైన వార్త వాస్తవమేనని, అయితే తేదీకి సంబంధించి మీకందని సమాచారం తప్పని అన్నారు. ఆ ఘటన 2022లో జరిగిందని, అప్పుడు ఎన్‌సి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేదని, ఎల్‌జి నేతృత్వంలోని ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ వైఫల్యం గురించి అందరికీ గుర్తుచేసినందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అంశంలో జమ్ముకాశ్మీర్ హైకోర్టు చేసిన పరిశీలనలు, జారీ చేసిన ఆదేశాలు కూడా ఉన్నాయని అన్నారు.
జమ్మూ కాశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (జెకెఎస్‌ఎస్‌బి) 'నిస్సిగ్గు అవకతవకల'పై విచారణ జరిపేందుకు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఎల్‌జి నేతృత్వంలోని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసిన జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు ఉత్తర్వులోని ఒక భాగాన్ని కూడా ఒమర్ అబ్దుల్లా ఎక్స్ పోస్ట్‌లో జతచేశారు. ఆ ఉన్నత స్థాయి కమిటీకి గానీ, ఆ నివేదికకు గానీ ఏమైందో మాకు తెలియదని అన్నారు. తర్వాత మీడియా సమావేశంలో మీరు ఆ వివరాలను వెల్లడించాలని కోరుకుంటున్నామని అన్నారు. 2022లో సబ్-ఇన్‌స్పెక్టర్లు, జూనియర్ ఇంజనీర్లు మరియు ఫైనాన్స్ అకౌంట్స్ అసిస్టెంట్లు వంటి పలు పోస్టుల కోసం జెకెఎస్‌ఎస్‌బి నిర్వహించిన నియామక పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీ, అవినీతిపై విమర్శలు వెల్లువ్తెడంతో పరీక్షను జమ్ముకాశ్మీర్ యంత్రాంగం రద్దు చేసిన సంగతి తెలిసిందే.







కామెంట్‌లు (0)