రాంచీ : జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో (జెపిఎస్‌సి, జెఎస్‌ఎస్‌సి) అక్రమాలు, అవతవకలు జరిగాయంటూ విద్యార్థులు, యువత ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. నిరసనలో భాగంగా సోమవారం ‘అసెంబ్లీ ముట్టడి’కి విద్యార్థులు పిలుపునిచ్చారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ నిషేధాజ్ఞలు విధించారు. డ్రోన్లను, బారికేడ్లను మోహరించారు. నిరసనకారులు మానవహారం ఏర్పాటు చేసి అసెంబ్లీ వైపు ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర నలుమూలల నుండి రాంచీకి వస్తున్న వందలాది మంది విద్యార్థులను పోలీసులు బలవంతంగా అడ్డుకుంటున్నారని నిరసనకారులు ఆరోపించారు.
"జార్ఖండ్ ఖనిజ సంపదతో కూడిన రాష్ట్రం. దేశం, ప్రపంచం మొత్తం జార్ఖండ్ ఖనిజాలను వినియోగిస్తుండగా, ప్రభుత్వ విధానాల కారణంగా ఇక్కడి విద్యార్థులు మాత్రం అంధకారంలో కూరుకుపోయారు. ఈ పరిస్థితికి సమాధానమివ్వాలని ప్రభుత్వాన్ని శాంతియుతంగా కోరుతున్నాము ’’ అని నిరసనకారులు పేర్కొన్నారు. నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్న వారి వాహనాలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని కూడా నిరసనకారులు ఆరోపించారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని జార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా (జెకెఎల్‌ఎం) ఎమ్మెల్యే జైరామ్ కుమార్ మహతో పేర్కొన్నారు. జెఎస్‌ఎస్‌సి -సిజిఎల్ పరీక్ష రద్దు చేయడమే ప్రధానమైన డిమాండ్ అని అన్నారు. పరీక్షలో అవతవకలు జరిగాయని, తాను సుమారు 400 మంది అభ్యర్థులను ఎంపిక చేయించానని అభయ్ తివారీ అంగీకరించారు.
ప్రభుత్వం యువతకు అండగా నిలుస్తుందని జార్ఖండ్ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ అన్నారు. ముఖ్యమంత్రి నివాసం వెలుపల నిరసన తెలిపిన బిజెపిపై విమర్శలు గుప్పించారు. యువతను పక్కదారి పట్టించడంలో బిజెపి నిపుణులని మండిపడ్డారు. ప్రభుత్వం యువతకు అండగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థుల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని, ఒక పరిష్కారాన్ని కనుగొంటామని అన్నారు. ముఖ్యమంత్రి నివాసం వెలుపల నిరసనలు తెలుపుతున్న జార్ఖండ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత బాబులాల్ మారండీ, పలువురు బిజెపి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.








కామెంట్‌లు (0)