- ముసాయిదా నివేదిక ఆమోదం వాయిదా
- ప్రతిపక్షాల అభ్యంతరం... ఈ అంశంపై మరింత చర్చ అవసరం... జెపిసి ఛైర్‌పర్శన్ అపరాజితా సారంగి
న్యూఢిల్లీ: తీవ్రమైన ఆరోపణలతో వరుసగా 30 రోజులు జైలులో ఉన్న ప్రధాని, కేంద్రమంత్రులు, సిఎంలను పదవి నుంచి తొలగించే బిల్లుపై నివేదిక ఆమోదాన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘం జెపిసి వాయిదా వేసింది. ఈ అంశంపై మరింత చర్చ అవసరమని కమిటీ సభ్యులు భావించినట్టు జెపిసి ఛైర్‌పర్సన్ అపరాజితా సారంగి తెలిపారు. 130వ సవరణ బిల్లుపై ఏర్పాటైన జెపిసి ఇటీవల సభ్యులకు పంపిణీ చేసిన తన ముసాయిదా నివేదికలో ఐదు సిఫారసులు చేసింది. శుక్రవారం ఒక్కో సిఫారసుపై కమిటీ విడివిడిగా ఓటింగ్ నిర్వహిస్తున్న సమయంలో మరిన్ని సంప్రదింపులు, సభ్యుల మధ్య చర్చ అవసరమని నిర్ణయించారు. ముసాయిదా ఆమోదాన్ని వాయిదా వేయాలని నిర్ణయించడంతో మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే తాము సమర్పించిన అసమ్మతి లేఖలను వెనక్కి తీసుకున్నారు. సంబంధిత వర్గాలతో మరిన్ని సంప్రదింపులు అవసరమని సంయుక్త పార్లమెంటరీ సంఘం ఏకగ్రీవంగా అభిప్రాయపడిందని సారంగి చెప్పారు. "ప్రస్తుతానికి దీనిని పెండింగ్‌లో ఉంచాం. మేం మొత్తం 27 రాజకీయ పార్టీలకు రెండు లేఖలు రాశాం. ఐదు పార్టీలు తమ సూచనలను పంపినప్పటికీ, ఇందులో భాగస్వాములు కావడానికి నిరాకరించాయి. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. కాబట్టి ఇతర పార్టీల సభ్యులతో మేము చర్చలు జరిపాం. ఈ బిల్లు దేశంపై సుదూర ప్రభావాలను చూపుతుందనే విషయంలో విస్తృత ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ ప్రతిపాదనపై మరింత చర్చ, పరిశీలన అవసరమని భావించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో కూడా చర్చలు కొనసాగుతున్నాయి" అని అపరాజిత సారంగి తెలిపారు.
గతేడాదే లోక్సభలో బిల్లు ప్రవేశ పెట్టిన హోంమంత్రి
గత ఏడాది ఆగస్టులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం, ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై సమగ్ర పరిశీలన నిమిత్తం అపరాజితా సారంగి నేతృత్వంలో జెపిసిని నియమించారు. తమ అభ్యంతరాలను అధికారపక్షం సులభంగా బేఖాతరు చేస్తుందని పేర్కొంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఇండియా బ్లాక్ సభ్యులంతా జెపిసిని బహిష్కరించారు. తమ ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ఈ చట్టాన్ని ఉపయోగించే అవకాశం ఉందని ఆరోపించాయి. అనంతరం ఈ ముసాయిదా చట్టాలను పార్లమెంటు సంయుక్త కమిటీకి పంపారు.
'నిర్బంధంలో ఉంటే శాశ్వతంగా తొలగించకుండా సస్పెండ్ చేయాలి'
జెపిసి ముసాయిదా నివేదికలో కీలక సూచనలు చేసింది. తీవ్రమైన నేరారోపణలపై ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులను వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే శాశ్వతంగా తొలగించకుండా సస్పెండ్ చేయాలని కమిటీ సిఫారసు చేసింది. అలాంటి వ్యక్తులు నిర్దోషులుగా విడుదలైనా లేదా నిర్దిష్ట కాలంలోగా విచారణ ముందుకు సాగకపోయినా, నిర్ణయాన్ని స్వయంచాలకంగా రద్దు చేసే నిబంధనను కూడా ఇది ప్రతిపాదించింది. గత ఆగస్టులో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం, ప్రధానమంత్రి, మంత్రులు లేదా ముఖ్యమంత్రులు స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగకపోతే, వారిని నిర్బంధించిన 31వ రోజున స్వయంచాలకంగా తొలగించవచ్చు. సన్‌సెట్ లేదా ఆటోమేటిక్ రివర్సల్ క్లాజ్‌ను ప్రవేశపెట్టాలని ప్రతిపాది స్తూ, మంత్రి నిర్దోషిగా విడుదలైనా లేదా నిర్దిష్ట కాలంలోగా విచారణ ముందుకు సాగక పోయినా సస్పెన్షన్ స్వయంచాలకంగా ముగిసిపోవాలని అది పేర్కొంది.








కామెంట్‌లు (0)