ఆగస్టు పదిహేనో తేదీ...
త్రివర్ణ పతాకం ఆకాశాన్ని తాకిన రోజు,
"స్వాతంత్ర్యం" అనే మాట గగనంలో మారుమ్రోగే రోజు.
ఆ పెద్ద మనిషి నోటి నుంచి
ఒక్క మాట జారింది–"దిమాగీ నక్సల్స్" .
ఆ మాటా? అది ఒక గండ్రగొడ్డలి దెబ్బ!
వామపక్ష గొంతులని నరికే కఠోర శిక్ష!
పుస్తకం చదివే కళ్ళనూ, ప్రశ్నించే పెదవులనూ,
భవిష్యత్తు కోసం కలలు కనే కన్నులనూ
ఒక్క లేబుల్ లో బంధించే విషపు సంకెళ్ళు!
ఆ మాట ఒక అగాధం తవ్వింది –
వైషమ్యాల వెల్లువను పెంచి,
సమాజంలో చీలికలను మరింత లోతు చేసింది.
స్వాతంత్ర్య దినాన..
స్వేచ్ఛా గగనంలో ఆ మాట ఒక విషపు బాణంలా
స్పందించే హృదయాల్లో గుచ్చుకుంది.
ఏమిటీ ధోరణి?
ఆలోచించే మెదడుకు "నక్సల్" ముద్ర,
దేశం కోసం ఆందోళన చెందే మనసుకు "ద్రోహి" బిరుదు.
ఇది స్వాతంత్ర్యమా? లేక విద్వేషానికి కొత్త రూపమా?
యువత రేపటి ఆశాకిరణాలు కాదా?
వారి ప్రశ్నలే దేశాన్ని మేల్కొలిపే కిరణాలు కాదా?
మీ పెదవుల మాట ప్రశ్నించే వారిని అవమానించవచ్చు,
కానీ ఆ "దిమాగీ" (తెలివిని) మాత్రం ఎవరూ ఆపలేరు.
ఆ తెలివి మంటలా, గాలిలా, సెలయేటిలా ప్రవహిస్తూనే ఉంటుంది.
ఎందుకంటే ఆ మాట యుగయుగాలుగా వస్తున్న సత్యానికి స్వంతం.
నిజమైన స్వాతంత్ర్యం అంటే
ఆ మాటకు విలువ ఇవ్వడమే,
దాన్ని నొక్కిచెప్పడమే,
ఆ మాటను అణచివేసి, నీళ్ళలో కలిపేసి,
ఒక కుంకుమ పువ్వుగా నటించడం కాదు!
శాంతిశ్రీ
8333818985







కామెంట్‌లు (0)