శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

యుపిని దాటిన కర్ణాటక.. ముసాయిదా దశలోనే 1.10 కోట్ల ఓట్ల తొలగింపు!

04 ఆగస్టు, 2026

SIR
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 12:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

బెంగళూరు : ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌లో కర్ణాటక యుపిని దాటింది. ముసాయిదా దశలోనే 1.10 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయి. ఆగస్టు 3 నాటికి రాష్ట్రంలో 1.10 కోట్ల మంది ఓటర్లు 'గైర్హాజరు, నివాసం మారినవారు, నకిలీలు, మరణించినవారు తదితరులు' (ASDDO) కేటగిరీ కింద గుర్తించబడ్డారు. ఇది రాష్ట్ర మొత్తం ఓటర్లలో 19.95 శాతం కావడం గమనార్హం. దీంతో, ముసాయిదా దశలోనే అత్యధిక ఓటర్ల తొలగింపులు నమోదైన రాష్ట్రంగా ఇప్పటివరకు ఉన్న ఉత్తరప్రదేశ్‌ (19.09%)ను కర్ణాటక అధిగమించింది. అరుణాచల్‌ప్రదేశ్‌ (18.7%), హర్యానా (16.3%), ఆంధ్రప్రదేశ్‌ (10.78%) కంటే కూడా కర్ణాటకలో ఈ శాతం ఎక్కువగా ఉంది. ఈ గణాంకాలు తుది జాబితాకు ముందే వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముసాయిదా దశలోనే ఐదుగురిలో ఒకరి పేరు తొలగింపు జాబితాలో చేరడం రాజకీయ, ఎన్నికల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


20 శాతం దాటే అవకాశం

రాష్ట్రంలో ఇంకా 2.41 లక్షల గణన పత్రాలు డిజిటలైజేషన్‌కు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల నమోదైన ధోరణిని పరిశీలిస్తే డిజిటలైజ్ చేస్తున్న ఫారాల్లో 60 శాతం నుంచి 75 శాతం వరకు ఏఎస్‌డీడీఓ కేటగిరీలోకి వెళ్తున్నాయి. దీంతో తుది గణాంకాల్లో ఈ శాతం 20 శాతం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 1 నుంచి 2 మధ్య ఒక్కరోజులోనే డిజిటలైజేషన్ కోసం పెండింగ్‌లో ఉన్న ఫారాలు 10.29 లక్షల నుంచి 4.89 లక్షలకు తగ్గాయి. అంటే 5.40 లక్షల ఫారాలు డిజిటలైజ్ చేయగా, అదే సమయంలో ఏఎస్‌డీడీఓ జాబితా 1.05 కోట్ల నుంచి 1.09 కోట్లకు పెరిగింది. డిజిటలైజ్ చేసిన వాటిలో 4.02 లక్షల ఫారాలు, అంటే దాదాపు 75 శాతం, ఏఎస్‌డీడీఓ కింద గుర్తించబడినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.


11 రోజుల్లో 24.58 లక్షల నుంచి 1.10 కోట్లకు

జులై 22 నాటికి డిజిటలైజేషన్ కోసం 1.41 కోట్ల ఫారాలు పెండింగ్‌లో ఉండగా, అప్పటికి ఏఎస్‌డీడీఓ జాబితాలో 24.58 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అనంతరం డిజిటలైజేషన్ వేగం పెరగడంతో ఆగస్టు 3 నాటికి పెండింగ్ ఫారాలు 4.89 లక్షలకు తగ్గిపోయాయి. అదే సమయంలో కేవలం 11 రోజుల్లోనే ఏఎస్‌డీడీఓ జాబితా 24.58 లక్షల నుంచి 1.10 కోట్లకు పెరగడం విశేషంగా మారింది.


అభ్యంతరాలకు ఆగస్టు 8 వరకు అవకాశం

ఏఎస్‌డీడీఓ జాబితాలో గుర్తించిన ప్రతి కేసులో మహజర్ (ఓటర్లు అందుబాటులో లేకపోవడం/ మరణించడం- రెండూ ) నిర్వహించామని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి వి. అన్బు కుమార్ తెలిపారు. గైర్హాజరు లేదా వేరే ప్రాంతానికి వెళ్లినట్లు గుర్తించిన ఓటర్లు ఆగస్టు 8లోపు సంబంధిత బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌ఓ) ద్వారా అవసరమైన ఫారాలు సమర్పించి తమ వివరాలను సరిదిద్దుకునే అవకాశం ఉందన్నారు. ఓటర్లు అభ్యంతరం తెలిపి, తాము గైర్హాజరు కాదని లేదా నివాసం మార్చలేదని నిరూపిస్తే వారి పేర్లను జాబితాలో కొనసాగిస్తామని, లేకపోతే తుది ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. అయితే, దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే కర్ణాటకలోనే ఏఎస్‌డీడీఓ గణాంకాలు ఎందుకు అత్యధికంగా నమోదయ్యాయనే విషయంపై ఎన్నికల అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం నమోదైన గణాంకాల ప్రకారం, తుది జాబితా విడుదలకు ముందే అత్యధిక ఓటర్ల తొలగింపులు నమోదైన రాష్ట్రంగా కర్ణాటక నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్