శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కర్త.. కర్మ.. క్రియ నృపేంద్ర మిశ్రాయే

54 నిమిషాల క్రితం

ram mandir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 12:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- మందిర నిర్మాణం, కమిటీ నిర్ణయాలలో ఆయన మాటే ఫైనల్‌

- అనుయాయులకే కమిటీలో చోటు

- ట్రస్ట్‌ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్‌ లేఖలో సంచలన అంశాలు

​లక్నో : అయోధ్య బాల రాముడి ఆలయం విరాళాల వివాదం నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన చంపత్‌ రాయ్‌ రాసిన తొమ్మిది పేజీల లేఖ వెలుగులోకి వచ్చింది. అయోధ్య రామమందిర నిర్మాణం విషయంలో కర్త...కర్మ...క్రియ అన్నీ ఐఎఎస్‌ మాజీ అధికారి, ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రాయేనని ఆయన ఆ లేఖలో వివరించారు. వచ్చే నెల 3వ తేదీన ట్రస్ట్‌ సమావేశమై సిఇఒను ఎంపిక చేస్తుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ లేఖ బయటకు వచ్చింది. విరాళాల దొంగతనం కుంభకోణం కారణంగా చంపత్‌ జూన్‌ 26న తన పదవికి రాజీనామా చేయడం, కుంభకోణంపై విచారణ జరిపిన సిట్‌ ఆయనకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం తెలిసిందే. ఆయన గత కొంతకాలంగా అయోధ్యలోనే తిష్ట వేసి సాధువులు, మత పెద్దలను కలుస్తున్నారు. దీంతో ఆయన మరోసారి ట్రస్ట్‌లో అడుగు పెడతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. గత నెల 6న జరిగిన ట్రస్ట్‌ సమావేశంలో రాయ్‌ రాజీనామాను ఆమోదించారు. ఈ నెల 18న ఆయన రాసిన లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

సర్వం తానై నడిపారు

చంపత్‌ ఆ లేఖలో ఏం రాశారంటే...ట్రస్టులో పదిహేను మంది ట్రస్టీలు ఉన్నారు. ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌గా మిశ్రా నియమితులయ్యారు. ఆయన సూచన మేరకు ఆలయ నిర్మాణానికి ఎల్‌ అండ్‌ టి సంస్థను ఎంపిక చేశారు. ఇతర భవనాల రూపకల్పన, నిర్మాణం కోసం నోయిడాకు చెందిన డిజైన్‌ అసోసియేట్‌ అనే సంస్థను ఎంపిక చేశారు. తనకు ఆప్తులైన కొందరు వ్యక్తులను నిర్మాణ కమిటీలోకి మిశ్రా తీసుకొచ్చారు. వారిలో ఒకరు ఆరు సంవత్సరాల వ్యవధిలో కేవలం ఒకటి రెండు సందర్భాలలో మాత్రమే అయోధ్యను సందర్శించారు. కమిటీలోని మరో సభ్యుడితో భద్రతా సంబంధమైన విషయాలపై సంప్రదించే వారు. మిశ్రాతో కలిసి ఎన్‌బీసీసీ మాజీ ఛైర్మన్‌ అనూప్‌ మిట్టల్‌ కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరయ్యే వారు. నిర్మాణ కమిటీ ప్రతి నెలా సమావేశమయ్యేది. కొంతకాలం పాటు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి భేటీ జరిగేది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతి నిర్ణయం కమిటీలోనే తీసుకునే వారు. నిర్మాణ సంబంధమైన నిర్ణయాలన్నింటికీ మిశ్రా ఎప్పుడూ తనను తానే ముఖ్యుడిగా భావించుకునే వారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి మిశ్రాయే కారణం. కరోనా మహమ్మారి సమయంలో 2020 జూన్‌లో ప్రారంభమైన ఈ భారీ రాతి ఆలయ నిర్మాణం 2026 జూన్‌లో పూర్తయింది. సమస్యలు ఎదురైనప్పుడు మిశ్రా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిపుణులను రప్పించి వారి సలహా మేరకు వాటిని పరిష్కరించే వారు. చాలా మంది నిపుణులు సేవాభావంతోనే సలహాలు ఇచ్చారు. ఎలాంటి పారితోషికం తీసుకోలేదు.

మిట్టల్‌ పాత్రపై...

మిట్టల్‌ పాత్రపై చంపత్‌ ఏమన్నారంటే...ఆయన ఇంజినీరింగ్‌ విషయాలపై మిశ్రాకు సలహాదారుడిగా పనిచేశారు. కమిటీ సమావేశాలకు సంబంధించిన లిఖితపూర్వక పత్రాలను సిద్ధం చేసే వారు. మిట్టల్‌ కుమారుడు, సివిల్‌ ఇంజినీర్‌ యశ్‌ మిట్టల్‌ కూడా క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరయ్యే వారు. తన ల్యాప్‌టాప్‌లో సమావేశ వివరాలను టైప్‌ చేసే వారు.

సింఘాల్‌ సలహా మేరకే ఎల్‌ అండ్‌ టి, టిసిఎస్‌ ఎంపిక

ప్రాజెక్టులో భాగస్వాములైన సంస్థల గురించి చంపత్‌ తన లేఖలో ఇలా రాశారు...దివంగత విహెచ్‌పి నేత అశోక్‌ సింఘాల్‌ సలహాలను మిశ్రాకు తెలియజేసే వారు. ఆ సలహాల ఆధారంగా ఆలయ నిర్మాణానికి ఎల్‌ అండ్‌ టిని, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంటుగా టిసిఎస్‌ను ఎంపిక చేశారు. 1986లో సింఘాల్‌ ఎంపిక చేసిన వాస్తు శిల్పి చంద్రకాంత్‌ సోంపురాను దేవాలయం నియమించింది. జై కక్దేకర్‌ నేతృత్వంలోని డిజైన్‌ అసోసియేట్‌ సంస్థను ఇతర భవనాల కోసం మిశ్రా ఎంపిక చేశారు. కాగా 70 ఎకరాల ఆలయ కాంప్లెక్స్‌ను రెండు భాగాలుగా విభజించారని చంపత్‌ పేర్కొన్నారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలను తెలియజేశారు. ట్రస్ట్‌ ఖాతాలను ఎస్‌బిఐ, పిఎన్‌బి, బిఒబి నిర్వహించాయని, ఆన్‌లైన్‌ బ్యాంక్‌ బదిలీల ద్వారా చెల్లింపులు జరిగాయని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్