ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తమ బతుకులు కాపాడాలని స్థానికులు ఒకవైపు వేడుకుంటుంటే సెంట్రల్ ఎంపవర్ కమిటీ (సిఇసి) తాజాగా జారీ చేసిన ఆదేశాలతో కొల్లేరు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సాంకేతిక అంశాలను చూపుతూ కొల్లేరు అక్రమ చెరువుల ధ్వంసానికి అటవీశాఖకు పూర్తిగా సహకరించాలని ఏలూరు జిల్లా కలెక్టరును సిఇసి శుక్రవారం ఆదేశించింది. దీంతో అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అన్న ఆందోళన కొల్లేర ప్రాంత రైతుల్లో వ్యక్తమవుతోంది.
కొల్లేరులో తాజా ఆక్రమణలు, అక్రమ గట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిటీ నివేదిక కోరింది. అభయారణ్యం పరిధిలోని అక్రమ చెరువులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంపై సిఇసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటపాక పక్షుల కేంద్రానికి నీటి సరఫరా నిలిపివేయడంతో పాటు కొల్లేరు కాలుష్యంపై సీరియస్ అయింది. కొల్లేరు లేక్ ప్రొటెక్షన్ కేసులో జిల్లా కలెక్టరుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరు సరస్సు పరిధిలోని అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేసేందుకు అటవీశాఖకు సహకరించాలని ఆదేశించింది. స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని, కూల్చివేతలకు అడ్డుతగులుతున్నారని కమిటీకి అటవీశాఖ సిఇసి దృష్టికి తీసుకువచ్చింది. దీంతో ,తక్షణమే రంగంలోకి దిగాలని ఏలూరు జిల్లా కలెక్టరును ఆదేశించింది. ఆటపాక బర్డ్ సెంటర్ ఎండిపోవడం, పక్షుల మనుగడ ప్రమాదంలో పడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మెడికల్ వేస్ట్, పురుగు మందుల వ్యర్థాలతో కొల్లేరు సరస్సు కలుషితం కావడంపై సమగ్ర సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొమటిలంక వైల్డ్‌లైఫ్ శాంక్చురీ పరిధిలోని అక్రమ చెరువులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంపై కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కూల్చివేతల పురోగతి, కాలుష్య నివారణ చర్యలపై త్వరలోనే నివేదిక సమర్పించాలని కోరింది.







కామెంట్‌లు (0)