• టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ ప్రయోగం
• చలో అసెంబ్లీ ఉద్రిక్తం
• జెపిఎస్‌సి మాజీ చైర్‌పర్సన్ అరెస్టు
రాంచీ : ఉద్యోగనియామక పరీక్షల్లో అవకతవలపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. జెపిఎస్‌సి, జెఎస్‌ఎస్‌సి అభ్యర్థులు రాంచిలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. అసెంబ్లీ భవనం వైపు సోమవారం ‘విధాన్ సభ ఘెరావ్’ మార్చ్ చేపట్టగా, పోలీసులు వారిని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ కెనాన్‌లు ప్రయోగిం చారు. కాగా, ఈ నిరసనల్లో పాల్గోనేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వేలాది మంది రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో రాజధానికి చేరుకున్నారు.
ఏం జరిగింది?
జగన్నాథ్ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించి, కొత్త అసెంబ్లీ కాంప్లెక్స్ వైపు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వరుసగా ఆరు రౌండ్ల టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘర్షణలో కొంతమంది గాయపడగా, ఒకరికి పోలీసు లాఠీ దెబ్బ తలకు తగిలింది. రాంచీ డిఎస్‌పి అజయ్ ఆర్యన్ మాట్లాడుతూ, నిరసనకారులపై ఎలాంటి బలప్రయోగం చేయవద్దని కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయని, జనసమూహాన్ని నియంత్రించేందుకు మాత్రమే వెనక్కి నెట్టామని, దీనిని లాఠీచార్జి కాదంటూ చెప్పుకొచ్చారు. తక్కువ ప్రభావం ఉండేలా పక్కకు టియర్ గ్యాస్ ప్రయోగించామని ఆయన వివరణ ఇచ్చారు.
9 రోజులుగా నిరాహార దీక్ష
జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా (జెఎల్‌కెఎం) నేత దేవేంద్ర నాథ్ మహతో గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్షలో ఉన్నారు. ఇప్పటికే 10.5 కిలోల బరువు కోల్పోయినప్పటికీ, అంబులెన్స్‌లో వచ్చి మార్చ్‌లో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ చిత్రపటాన్ని చేతబట్టుకుని ఆయన నిరసనలో పాల్గొవడం గమనార్హం. ‘‘మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం... నా ఆరోగ్యం క్షీణిస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం జరిగిన చర్చల అనంతరం, 14వ జెపిఎస్‌సి ప్రిలిమినరీ పరీక్ష, అలాగే 2023, 2025లో నిర్వహించిన జెపిఎస్‌సి బ్యాక్‌లాగ్ పరీక్షలను రద్దు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. జెపిఎస్‌సి సభ్యులు ముగ్గురూ రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ‘‘పూర్తి పారదర్శకతతో న్యాయం జరుగుతుంది’’ అని హామీ ఇచ్చారు. అయితే, జెఎస్‌ఎస్‌సి-సిజిఎల్ పరీక్షలో అవకతవకలపై సిబిఐ దర్యాప్తు జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
జెపిఎస్‌సి చైర్‌పర్సన్ అరెస్టు
నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి మాజీ జెపిఎస్‌సి చైర్‌పర్సన్ ఎల్ ఖియాంగ్టేను జార్ఖండ్ సిఐడి సోమవారం అరెస్టు చేసింది. గత నెల 28 నుంచి ఆయనను నాలుగుసార్లు పోలీసలు విచారించారు. జెఎస్ఎస్‌సి-సిజిఎల్ పరీక్షలో అవకతవకలపై రాష్ట్ర పోలీసుల సిఐడి దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ తో పాటు పలు ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కూడా దర్యాప్తు ప్రారంభించింది.
అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ 750 మీటర్ల పరిధిలో భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధించారు. జగన్నాథ్ ఆలయం వద్ద రేజర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దాదాపు 1,500 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, జిల్లా పోలీసు, క్యూఆర్‌టి సిబ్బందిని మోహరించారు. నగరంలోని చాలా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.







కామెంట్‌లు (0)