అక్టోబరు 6 నుండి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ
న్యూఢిల్లీ : శాసనపరమైన అధికారాలు పౌరుల ప్రాధమిక హక్కయిన భావ ప్రకటనా స్వేచ్ఛను అధిగమిస్తాయా లేదా అని ప్రశ్నిస్తూ దాఖలై, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న పలు పిటిషన్లను ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 6 నుండి వరుసగా విచారించనుంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2003 ఏప్రిల్ నాటి కేసులో ఒక ఆదేశాన్ని జారీ చేసింది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను విమర్శిస్తూ హిందూ ప్రచురించిన సంపాదకీయంలో అసెంబ్లీ కార్యకలాపాలను వక్రీకరించిందని పేర్కొంటూ సభలో ఆనాటి అసెంబ్లీ స్పీకర్ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల భావ ప్రకటనా స్వేచ్ఛకు, వారి ప్రత్యేక రక్షణలకు హామీ కల్పిస్తున్న రాజ్యాంగంలోని 194వ అధికరణ కింద, హిందూ సంపాదకీయంలో చేసిన వ్యాఖ్యలు, మొత్తంగా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని ఆ తీర్మానం పేర్కొంది. ఐదుగురు హిందూ సీనియర్ జర్నలిస్టులను అరెస్టు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానించగా, పోలీసులు జర్నలిస్టులను అరెస్టు చేయాలనుకున్నారు. అప్పటి హిందూ సంపాదకుడు ఎన్.రవితో సహా జర్నలిస్టులందరూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వారిపై ఎటువంటి బలవంతపు చర్య చేపట్టకుండా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.








కామెంట్‌లు (0)