భారత దిగుమతులు 52 శాతం వృద్ధి
న్యూఢిల్లీ : పశ్చిమాసియా ఘర్షణలతో చమురు ఒత్తిడిని ఎదుర్కొంటున్న భారత్‌కు రష్యా నుంచి భారీ ఊరట లభిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో రష్యా నుంచి భారత్ చేసుకున్న స్థూల సరుకుల దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే రష్యా నుంచి దిగుమతుల్లో ఏకంగా 52.59 శాతం వృద్ధి నమోదైంది. భారతీయ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురును కొనుగోలు చేయడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఒక్క త్రైమాసికంలోనే రష్యా నుంచి భారత ముడి చమురు దిగుమతులు 55 శాతం పెరగడం విశేషం. రెండు రోజుల రష్యా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాస్కోలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైన సమయంలో ఈ వాణిజ్య వృద్ధి అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. అమెరికా నుంచి రష్యా చమురు కొనుగోళ్లపై ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఈ స్థాయిలో పెరగడం విశేషమని పుతిన్ కొనియాడారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధం మరింత బలపడాల్సిన అవసరం ఉందని జైశంకర్ పేర్కొన్నారు. అదే విధంగా భారత్ ఎదుర్కొంటున్న తీవ్ర వాణిజ్య లోటు గురించి పుతిన్ దృష్టికి తీసుకెళ్లారు.
గడిచిన జూన్ త్రైమాసికంలో భారత్-రష్యాల మధ్య మొత్తం వాణిజ్యం 50.48 శాతం పెరిగి 26.82 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది 17.82 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురు విలువే సుమారు 23.61 బిలియన్ డాలర్లు (గతేడాది 15.14 బిలియన్ డాలర్లు)గా ఉంది. అయితే దిగుమతులు ఈ స్థాయిలో ఉన్నప్పటికీ రష్యాకు భారత ఎగుమతులు మాత్రం కేవలం 1.24 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా రష్యా నుంచి ఎరువులు, వృక్ష, జంతు సంబంధిత కొవ్వులు, రత్నాలు వంటివి కూడా భారత్ దిగుమతి చేసుకుంటోంది. అయితే, రష్యా నుంచి వచ్చే నాన్ ఇండస్ట్రియల్ వజ్రాలపై యూరప్ దేశాలు ఆంక్షలు కఠినతరం చేయడంతో రత్నాల దిగుమతులు తగ్గి గుజరాత్‌లోని సూరత్ వజ్రాల పరిశ్రమపై కొంత ప్రభావం పడింది.








కామెంట్‌లు (0)