ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌సి, ఎస్‌టి వర్గాల రిజర్వేషన్లలో క్రిమీలేయర్‌ విధానాన్ని వ్యతిరేకించిన మాయావతి

1 గంట క్రితం

Mayawati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 03:11 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

లక్నో : ఎస్‌సి, ఎస్‌టి వర్గాల రిజర్వేషన్లలో క్రిమీ లేయర్‌ విధానాన్ని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్ష‍ురాలు మాయావతి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. సామసాజిక పరివర్తన, ఆర్థిక విముక్తి, ఆత్మగౌరవంతో రిజర్వేషన్ల వ్యవస్థ ముడిపడి ఉందని ఆమె వాదించారు. శతాబ్దాలుగా వివక్ష‍, దోపిడీ, వంచనకు గురై ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి వర్గాలకు రిజర్వేషన్‌ అనేది అత్యంత కీలకమైన, సున్నితమైన అంశమని అన్నారు. ఈ వర్గాలకు సంబంధించి క్రిమీ లేయర్‌ గురించి చర్చించడం అనుచితం మాత్రమే కాకుండా, డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ నేతృత్వంలో రూపొందించబడిన రాజ్యాంగలోని మానవతావాద లక్ష్యాలకు విరుద్ధమని వాదించారు. శతాబ్దాలుగా కుల వ్యవస్థ కారణంగా బాధితులైన, దోపిడీకి గురైన, అణచివేయబడిన, నిర్లక్ష్యం చేయబడిన, సమాజం నుంచి వెలివేయబడిన కోట్లాది ప్రజలకు మానవతా దృక్పథంతో రాజ్యాంగం, చట్టం కల్పించిన సమానత్వ హక్కును అందించడమే రిజర్వేషన్ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు.


రిజర్వేషన్లను ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేశారని, ఇది సమాజంలో విద్వేషాలను సృష్టిస్తోందని, లబ్ధిదారులు తమ ప్రయోజనాలను స్వచ్ఛందంగా వదులుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి కులతత్వ మనసత్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని, ఇది సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడవచ్చు కానీ రాజ్యాంగ లక్ష్యాలను దెబ్బతీస్తుందని ఆమె అభివర్ణించారు. కుల వివక్షను కేవలం ఆర్థిక పురోగతితో కొలవలేము. దాని ప్రభావం బాధితుల జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తూనే ఉందని ఆమె పేర్కొన్నారు. కేంద్రంలోని వరుస ప్రభుత్వాలకు 'క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితి' గురించి తెలుసని, ఎస్సీ, ఎస్టీలను క్రీమీ లేయర్ పరిధికి వెలుపల ఉంచాలనుకుంటే ప్రస్తుత ప్రభుత్వం కోర్టుల ముందు తన వాదనను సమర్థవంతంగా వినిపించాలని మాయావతి అన్నారు. అప్పుడే అది పూర్తిగా సముచితం, రాజ్యాంగబద్ధం అవుతుందని అన్నారు. ప్రభుత్వం తన వాదనలను సరిగా వివరించకపోవడం, సమర్థవంతమైన న్యాయ ప్రాతినిథ్యం లేకపోవడం వలన సామాజిక పరివర్తనకు సంబంధించిన అంశాల్లో కోర్టులు సరైన న్యాయం అందించలేకపోతున్నాయని అన్నారు.


రాజ్యాంగాన్ని గౌరవించాలని, రిజర్వేషన్ల విధానంలో మార్పుల కోసం వాదించడం మానుకోవాలని మాయావతి ఆర్‌ఎస్‌ఎస్‌ను కోరారు. అంబేద్కర్ రూపొందించిన రిజర్వేషన్లను రాజకీయం చేయడం మానుకోవాలని, అలాగే రిజర్వేషన్ వ్యవస్థలో జోక్యాన్ని మానుకోవాలని ఆమె అన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్