- జస్టిస్ నాగరత్న
న్యూఢిల్లీ : కుటుంబ వివాదాల్లో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగంపై మరింతగా ఆధారపడాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న శనివారం పిలుపిచ్చారు. న్యాయస్థానాల్లో సుదీర్ఘంగా సాగే యుద్ధాల కన్నా మధ్యవర్తిత్వం, రాజీ ప్రయత్నాలు వంటి పద్దతులతో మరింత వేగంగా, తక్కువ నష్టంతో ఫలితాలు రాబట్టగలుగుతామని సూచించారు. ‘‘ఎడిఆర్ (ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాలు) వర్సెస్ కుటుంబ వివాదాల్లో పరిష్కారం : సవాళ్ళు, పురోగతి’’ అనే అంశంపై ప్రారంభోపన్యాసం సందర్భంగా జస్టిస్ నాగరత్న పై వ్యాఖ్యలు చేశారు. గౌహతి హైకోర్టుతో కలిసి సుప్రీం కోర్టుకు చెందిన ఈస్ట్రన్ జోన్ రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది కమిటీ ఫర్ ఫ్యామిలీ కోర్ట్ మేటర్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సుకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఉజ్జల్ భుయాన్, ఎన్.వి.అంజారియాతో పాటూ పలువురు హైకోర్టుల చీఫ్ జస్టిస్లు కూడా హాజరయ్యారు.
ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార యంత్రాంగమనేది న్యాయస్థానాలతో పోటీ పడేందుకు ఉద్దేశించినది కాదని, వాటికి అనుబంధంగా వ్యవహరించేది మాత్రమేనని అమె ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులతో పేర్కొన్నారు. సాంప్రదాయ వ్యాజ్యాలు తరచుగా ఇవ్వలేని విశ్వసనీయతను, వేగాన్ని, గోప్యతను ఇవి ఇస్తాయని అన్నారు. సుప్రీం కోర్టు కమిటీ ఫర్ ఫ్యామిలీ కోర్ట్ మేటర్స్కి నాగరత్న ఛైర్పర్సన్గా వున్నారు. కేసు దాఖలు చేయడానికి, తుది తీర్పు రావడానికి మధ్య అనేక సంవత్సరాలు గడిచిపోతాయని, అప్పటికల్లా, కుటుంబ బంధం కొనసాగుతోందనడానికి చెప్పుకునే ఏ చిన్న ఆనవాలు కూడా లేకుండా కనుమరుగై పోతుందని ఆమె పేర్కొన్నారు. అటువంటి జాప్యాలు కుటుంబాల్లో ప్రస్తుతమున్న అసమానతలను మరింత తీవ్రతరం చేస్తాయని ఆమె హెచ్చరించారు. అందువల్ల ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాల ద్వారా ఈ భారాన్ని తగ్గించడానికే ప్రాధాన్యతనివ్వాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె న్యాయ శాఖ డేటాను ఉదహరించారు. 2024 అక్టోబరు నాటికి దేశంలో 822 కుటుంబ కోర్టులు వున్నాయన్నారు. తూర్పు రాష్ట్రాల్లో బీహార్ 70,365 పెండింగ్ కేసులతో అగ్ర స్థానంలో వుందన్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఒరిస్సా (36,792), జార్ఖండ్ (15,376), అస్సాం(7,399), త్రిపుర (4010) వున్నాయి.








కామెంట్లు (0)