- 71.59 లక్షల ఓట్లతో తుది జాబితా విడుదల
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో సుమారు తొమ్మిది లక్షల పేర్లు తొలగించారు. రాష్ర్టంలో ఎస్ఐఆర్ తరువాత తుది జాబితాను ఉత్తరాఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి బివిఆర్సి పురుషోత్తం శనివారం విడుదల చేశారు. ఈ తుది జాబితాలో 71.59 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
ఈ జాబితాలో కొత్తగా నమోదైన ఓటర్లు 1,29,872 మంది ఉన్నారని పురుషోత్తం తెలిపారు. ఈ రాష్ర్టంలో జూన్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు జాబితాలో 79,60,762 మంది నమోదిత ఓటర్లు ఉండగా, జూలై 14న విడుదలైన తొలి ముసాయిదా జాబితాలో 71,33,785 పేర్లు ఉన్నాయి. ఆగస్టు 13 వరకు అభ్యంతరాలు- క్లెయిమ్లను స్వీకరించడం, వీటిపై సెప్టెంబర్ 28 వరకు విచారణ, పరిష్కార ప్రక్రియ కొనసాగాయి. శనివారం తుది జాబితా విడుదలయింది.
‘ముసాయిదా జాబితాతో పోలిస్తే, ఓటర్ల సంఖ్య సుమారు 25,000 పెరిగింది. ఎందుకంటే క్లెయిమ్లు, అభ్యంతరాల తర్వాత 1,04,708 పేర్లు తొలగించగా, 1.29 లక్షలకు పైగా పేర్లు కొత్తగా చేర్చాం’ అని పురుషోత్తం తెలిపారు. తుది జాబితాలో 34,21,036 మంది మహిళలు, 37,37,701 మంది పురుషులు, 212 మంది థర్డ్-జెండర్ ఓటర్లు ఉన్నారు. 18-19 ఏళ్ల వయస్సు గలవారు 72,656 మంది, 80 ఏళ్లు పైబడిన వారు 1,22,892 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 12,543 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. తుది ఓటర్ల జాబితాలో కూడా పేరు లేని వారి కోసం, అలాగే కొత్తగా ఓటు హక్కు పొందిన వారు 'ఫారం-6' నింపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దీన్ని ఆన్లైన్లో లేదా బూత్ స్థాయి అధికారి ద్వారా ఆఫ్లైన్లో సమర్పించవచ్చునని చెప్పారు.
తొలగించిన ఓటర్ల వివరాలు బహిర్గతం చేయాలి : కాంగ్రెస్
తుది ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సూర్యకాంత్ ధస్మానా మాట్లాడుతూ ఎస్ఐఆర్తో తొలగించిన ఓటర్ల వివరాలను, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సంఘం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. "తుది జాబితాలో 8.5 లక్షలకు పైగా పేర్లను తొలగించగా, ఎస్ఐఆర్ దశలో 4.5 లక్షల పేర్లను తొలగించారు. అంటే ఇంత చిన్న రాష్ట్రంలో మొత్తం 13 లక్షల పేర్లు తొలగించారు’ అని ధస్మానా విమర్శించారు. ఎస్ఐఆర్తో చేసిన ఓట్ల చేర్పులు, తొలగింపులను కాంగ్రెస్ అంగీకరించదని, తొలగించిన ఓటర్ల పేర్లన్నింటినీ ఓటర్ల జాబితాలో వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)