బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కలెక్టరేట్లలోనూ నామినేషన్లు

3 గంటల క్రితం

supreme
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 11:32 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- దాఖలుకు గడువు పొడిగించండి

- ఎస్‌ఇసికి సుప్రీం ఆదేశం

- అభ్యర్థులకు రక్షణ కల్పించండి : డిజిపికి ఉత్తర్వులు

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో: శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన చోట అవసరమైతే జిల్లా కలెక్టరేట్లలో నామినేషన్లను స్వీకరించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిర్ధేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపల్‌ ఎన్నికల్లో చోటుచేసుకున్న నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌కుండా అడ్డుకోవ‌డంపై వైసిపి దాఖలు చేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహనలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా అవసరమైతే జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్‌ ఎదుట నామినేషన్లు దాఖలు చేసేందుకుకూడా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఎన్నికల్లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పాల్గొనే అవకాశం లభించిందన్న విశ్వాసాన్ని పిటిషనర్‌‌కు, ఇతర అభ్యర్థులకు కలిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఇసిని ఆదేశించింది. నామినేషన్ల కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు తోపాటు సిసిటివిలను ఏర్పాటు చేయాలని, నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు అవసరమైన రక్షణ కల్పించాలని డిజిపికి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తుది అభ్యర్థుల జాబితా ప్రచురణను అక్టోబరు 25 వరకు వాయిదా వేయాలని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. శాంతిభద్రతల సమస్యల కారణంగా నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థులకు అవకాశం కల్పించే విషయాన్ని నేటి (గురువారం)లోగా నిర్ణయం తీసుకోవాలని నిర్ధేశించింది. బుధవారం ప్రకటించాల్సి ఉన్న తుది అభ్యర్థుల జాబితాను 25వ తేది వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. హింస కారణంగా నామినేషన్లు దాఖలు చేయలేకపోయినట్లు పిటిషనర్లు పలు సాక్ష్యాలను, ఎల ఎలక్ట్రానిక్‌ ఆధారాలను అందించారని ధర్మాసనం తెలిపింది. వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించిలని సూచించింది. శాంతిభద్రతల సమస్యల కారణంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన స్థానిక సంస్థల్లో గడువు పొడిగింపుపై గురువారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఆ నిర్ణయాన్ని ప్రకటించిన స్థానాల్లో కనీసం 48 గంటలపాటు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలని, దానికి అనుగుణంగా ఎన్నికల నోటిఫికేషన్‌ను సవరించాలని పేర్కొంది. తదుపరి విచారణను 27వ తేదికి వాయిదా వేసిన న్యాయమూర్తులు తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలను ఆ రోజు కోర్టులో సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని, డిజిపిని ఆదేశించింది.

రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం

​స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకునే హక్కు కూడా ఈ ప్రక్రియలో అంతర్భాగమని స్పష్టం చేసింది. సాధారణంగా ఎన్నికల నిర్వహణలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదన్న సూత్రం ఉన్నప్పటికీ, అక్రమ పద్ధతులతో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగినప్పుడు న్యాయస్థానాలు ప్రేక్షక పాత్ర వహించలేవని తెలిపింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు విఘాతం కలిగించేలా చట్టవిరుద్ధ చర్యలు చోటుచేసుకున్నప్పుడు మౌనంగా ఉండలేవని స్పష్టం చేసింది.

ప్రాధమిక ఆధారాలున్నాయి...

నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నా రంటూ వైసిపి, ఆ పార్టీ అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులు, సమర్పించిన వీడియో దృశ్యాలను పరిశీలించిన ధర్మాసనం, ఆ మేరకు ప్రాథమికంగా తగిన ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం కల్పించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకమని పేర్కొంది. అదే సమయంలో ఇప్పటికే ఉల్లంఘనలు జరిగాయని ఫిర్యాదులు వచ్చినచోట వాటిపై ఏమి చర్యలు తీసుకున్నారన్నది కూడా పరిశీలించాల్సిఉందని సూచించింది.

​63.5 శాతం మందికి నామినేష‌న్ దాఖ‌లుకు *అవకాశం దక్కలేదన్న వైసిపి

మొత్తం 19 పట్టణ స్థానిక సంస్థల్లో తమ అభ్యర్థుల్లో 63.5 శాతం మందిని నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని వైసిపి తరపు సీనియర్‌ న్యాయవాది మణీందర్‌ సింగ్ ధ‌ర్మాస‌నానికి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులపై దాడులు జరిగాయని, బెదిరింపులకు పాల్పడ్డారని, నామినేషన్‌ పత్రాలను చించివేశారని పేర్కొన్నారు. కడపలో ఒక అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించివేశారని, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తొమ్మిది మంది అభ్యర్థులను సంబంధిత రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. తిరుపతికి చెందిన తొమ్మిది మంది అభ్యర్థులు తమకు ఎదురైన అడ్డంకులపై అఫిడవిట్లు దాఖలు చేసినట్లు వివరించారు. పుంగనూరు, రాయచోటి, కడప, తిరుపతి ప్రాంతాల్లో జరిగినట్లు చెబుతున్న ఘటనలను కూడా ప్రస్తావించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వైసిపి ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. హింసకు వైసిపి నేతలే కారణమని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియ‌ర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదించారు. ఎన్నికల్లో పోటీ చేయడం కన్నా మీడియాతో ప్రచారం పొందేందుకే పార్టీ ప్రయత్నిస్తోందని మరో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ పేర్కొన్నారు ఎన్నికల సంఘం న్యాయవాది కె. పరమేశ్వర్‌ ష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్