- ఉద్యోగులలో ద్విచక్ర వాహనాలు, కార్ల వాడకమే అధికం
న్యూఢిల్లీ : విధి నిర్వహణ కోసం బయటికి పోయే వారిలో బస్సు, రైలు, ట్రామ్, ఆటోరిక్షా వంటి ప్రజా రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నది కేవలం పదిహేను శాతం మంది మాత్రమే. మిగిలిన వారిలో 46 శాతం మంది ద్విచక్ర వాహనాలను, కార్లను వాడుతున్నారని దేశంలో తొలిసారిగా నిర్వహించిన జాతీయ కుటుంబ ప్రయాణ సర్వే (ఎన్హెచ్టీఎస్) తెలిపింది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఈ సర్వేను నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉద్యోగులలో 43 శాతం మంది ద్విచక్ర వాహనాలను, మూడు శాతం మంది కార్లను వినియోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో వీటిపై ఆధారపడుతున్న వారి సంఖ్య మరింత అధికంగా ఉంది. అక్కడ 53 శాతం మంది ఉద్యోగులు ద్విచక్ర వాహనాలను, 5.7 శాతం మంది కార్లను వాడుతున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలను వాడుతున్న రాష్ట్రాలలో గోవా (83.3 శాతం), పంజాబ్ (64.7 శాతం), తెలంగాణ (64.3 శాతం), తమిళనాడు (61.6 శాతం), కేరళం (59.7 శాతం) ఉన్నాయి.ప్రయాణాలపై నెలవారీగా ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాలలో ఢిల్లీ (రూ.2,038), గోవా (రూ.1,874), కేరళం (రూ.1,415), చండీగఢ్ (రూ.1,383), హర్యానా (రూ.1,212) ఉన్నాయి. సర్వేలో బయటపడిన మరో ఆసక్తికరమైన విషయమేమంటే 28.3 శాతం మంది కాలినడకన పని ప్రదేశానికి చేరుకుంటున్నారు. 10.7 శాతం మంది సైకిళ్లపై వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో మూడో వంతు మంది కంటే ఎక్కువగా...అంటే 36 శాతం మంది కాలికి పని చెప్పి పనికి వెళుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వీరి సంఖ్య 14 శాతం మాత్రమే. 2025 జూన్-2026 జూన్ మధ్యకాలంలో ఈ సర్వేను నిర్వహించారు. కిలోమీటరు కంటే ఎక్కువ దూరాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. రాకపోకలను రెండు ట్రిప్పులుగా లెక్కించారు. పని ప్రదేశానికి చేరుకోవడానికి ఉద్యోగికి సగటును ఇరవై ఐదు నిమిషాల సమయం పడుతోందని సర్వే తెలియజేసింది. పట్టణ ప్రాంతాలలో ఇది 27 నిమిషాలు కాగా గ్రామీణ ప్రాంతాలలో 23 నిమిషాలుగా ఉంది. ఉదయం పది గంటలకు ముందే 95 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. పని ప్రదేశానికి వెళ్లి రావడానికి ఉద్యోగులు ప్రతి నెలా సగటున రూ.785 ఖర్చు చేస్తున్నారు. మహిళలతో పోలిస్తే పురుషులలో ఈ ఖర్చు ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఈ వ్యత్యాసం మరింత అధికంగా ఉంటోంది. అక్కడ మహిళలు సగటున రూ.307 ఖర్చు చేస్తుంటే పురుషులు రూ.674 ఖర్చు చేస్తున్నారు.
విద్యార్థుల విషయానికి వస్తే 37 శాతం మంది కాలినడకనే విద్యా సంస్థలకు చేరుకుంటున్నారు. 29.5 శాతం మంది బస్సులలో, 15.8 శాతం మంది సైకిళ్లపై వెళుతున్నారు. 88 శాతం మంది విద్యార్థులు తమ విద్యా సంస్థలకు చేరుకోవడానికి సగటున 30 నిమిషాల సమయం తీసుకుంటున్నారు.








కామెంట్లు (0)