బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్టోబర్‌ 6న ఇసి కార్యాలయానికి ప్రతిపక్ష‍ ఎంపిల ర్యాలీ : ఇండియాబ్లాక్‌

1 గంట క్రితం

india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 03:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఓట్ల చోరీకి నిరసనగా అక్టోబర్‌ 6న ఎంపిలందరూ ఎన్నికల సంఘం (ఇసి) కార్యాలయానికి ర్యాలీ చేపడతామని ప్రతిపక్ష‍ కూటమి ఇండియా బ్లాక్ పేర్కొంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఈ సమావేశం జరిగింది. అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 8 మధ్య అన్ని జిల్లాల్లోనూ ప్రతిపక్ష పార్టీలు "ప్రజాస్వామ్య పరిరక్షణ" ర్యాలీలను నిర్వహిస్తాయని కాంగ్రెస్ అధ్యక్ష‍ుడు, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో అవకతవకలపై తాము చేపట్టాల్సిన కార్యాచరణపై, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకురావడానికి ఇండియా బ్లాక్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం) స్థానంలో బ్యాలెట్ పేపర్లను ప్రవేశపెట్టాలని ఖర్గే పేర్కొన్నారు. బ్యాలెట్‌ పేపర్లకు ఇండియా బ్లాక్ నేతలంతా ఆమోదం తెలిపారని అన్నారు. 2026, నవంబర్ 1న ఢిల్లీలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రజల ఓటు హక్కును, ఇతర రాజ్యాంగపరమైన హక్కులను ఎలా హరిస్తోందో ప్రజలకు వివరించేందుకు ప్రతిపక్షాలు ఐదు భారీ ర్యాలీలను చేపడతాయని వెల్లడించారు.


ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిన వారికి శిక్ష తప్పదని లోక్‌సభ ప్రతిపక్ష‍ నేత రాహుల్ గాంధీ అన్నారు. తాము చర్చ జరిపామని, ప్రధాని మోడీ, అమిత్ షా, జ్ఞానేష్‌ కుమార్ ఎన్నికలను అపహరించారన్నది నేతలందరి ఉమ్మడి అభిప్రాయమని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిన వారు ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నవారైనప్పటికీ, వారికి శిక్ష తప్పదని అన్నారు. రాజ్యాంగాన్ని సమిష్టిగా రక్షించాల్సిన బాధ్యత నేతలదేనని సూచించానని అన్నారు. రాజ్యాంగంపై మోడీ ప్రభుత్వం పదేపదే చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా, అధికారంలో కొనసాగేందుకు ఎన్నికల సంఘం (ఇసి) సహకారంతో చేపడుతున్న ‘‘ఓట్ల చోరీ’’కి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఐక్యమయ్యాయని అన్నారు.


గత 10 నెలల్లో ఎన్నికల సంఘంలోని ఇద్దరు సభ్యులు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఎస్ఐఆర్, ఓటర్ల జాబితాకు సంబంధించిన వివిధ నిర్ణయాలపై కనీసం 14 మంది అభ్యంతరాలు దాఖలు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ నివేదికపై ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్ (ఇసి) అంతర్గత పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి. జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని, ఎస్ఐఆర్ ను వెంటనే మూసివేయాలని సిపిఐ(ఎం), సిపిఐ, సిపిఐ(ఎంఎల్)-లిబరేషన్ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్ని ప్రతిపక్ష పార్టీలకు లేఖ రాశారు. అనంతరం ఇండియబ్లాక్‌ సమావేశానికి పిలుపునిచ్చింది.


ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ లోక్ సభ, రాజ్యసభల్లో ముసాయిదా నోటీసులు పిలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నోటీసుపై సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.


ఇండియ బ్లాక్‌ సమావేశానికి సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. సమాజ్ వాదీ పార్టీ, సిపిఐ, ఎన్సీపీ, శివసేన (యూబీటీ) సహా ఆర్జేడీ, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, సిపిఐ-ఎంఎల్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), ఎండీఎంకే, వీసీకే, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్ (జాకబ్), మమతా బెనర్జీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సహా పలు పార్టీలు హాజరయ్యాయి. అయితే డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈ సమాసవేశానికి హాజరుకాలేదు. ఉత్తరప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ పనుల్లో బిజీగా ఉన్నందున సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్