మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionస్తంభించిన పార్ల‌మెంటు

1 గంట క్రితం

Screenshot from 2026-08-04 21-56-02.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 12:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • నీట్‌ అక్రమాలు, అయోధ్య విరాళాల కుంభకోణాలపై ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌

ప్ర‌జాశ‌క్తి - న్యూఢిల్లీ బ్యూరో : నీట్ అక్రమాలు, అయోధ్య రామాల‌య విరాళాల కుంభకోణాలపై పార్ల‌మెంటు ఉభయ స‌భ‌లు మంగళవారం కూడా స్తంభించాయి. అటు లోక్‌‌సభ, రాజ్యసభలోనూ..ఇటు పార్ల‌మెంటు ఆవ‌ర‌ణంలోనూ ప్ర‌తిప‌క్షాలు త‌మ ఆందోళ‌న‌ను కొన‌సాగించాయి. ప్రతిపక్ష సభ్యుల నిరసనహోరు కొనసాగుతుండగానే.. ఎటువంటి చ‌ర్చ లేకుండా లోక్‌స‌భ‌లో రెండు బిల్లుల‌ను, రాజ్య‌స‌భ‌లో ఒక బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు. తొలుత లోక్‌స‌భ‌ను స్పీక‌రు ఓం బిర్లా ప్రారంభిస్తూ ప్ర‌శ్నోత్త‌రాలు నిర్వ‌హించేందుకు సిద్ధ‌మవుతుండగానే.. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళ‌న చేప‌ట్టారు. మోడీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా పెద్ద‌పెట్టున నినాదాల హోరెత్తించారు. ప్ర‌ధాన‌ మంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స‌భ‌కు రావాల‌ని, విద్యార్థుల‌పై జ‌రిగిన పోలీసుల దాడికి స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. దీంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో స‌భ‌ను మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లోనూ ప్ర‌తిప‌క్షాలు త‌మ ఆందోళ‌న‌ను కొనసాగించాయి. అయితే.. ఈ ఆందోళ‌న‌ల నడుమే కేంద్రం రెండు బిల్లుల‌ను ప్రవేశపెట్టింది. ట్యాక్సేషన్ ఇతర చట్టాల సవరణ బిల్లు, అప్రాప్రియేషన్ బిల్లు-2026ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. దీంతో వెంటనే సభలో చర్చకు రాగా.. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ఇరు బిల్లులనూ వ్యతిరేకించారు. కానీ.. చివరకు మూజు వాణి ఓటుతో రెండు బిల్లులూ ఆమోదం పొందాయి. ఆ వెంట‌నే సభను నేటికి వాయిదా వేశారు. మ‌రోవైపు రాజ్య‌స‌భ‌లోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగింది. స‌భ‌ను ఛైర్మ‌న్ సిపి రాధాకృష్ణ‌న్ ప్రారంభించ‌గా, జీరో అవ‌ర్ నిర్వ‌హించేందుకు సిద్ధ‌ప‌డ్డారు. ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న కొన‌సాగించాయి. దీంతో స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లోనూ ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న కొన‌సాగించాయి. దీంతో స‌భ‌ను మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు వాయిదా వేశారు. అనంత‌రం ప్రారంభ‌మైన స‌భ‌లో జ‌న‌న‌, మ‌ర‌ణ న‌మోదు సవ‌ర‌ణ బిల్లుపై చ‌ర్చ జ‌రిగింది. ఈ బిల్లును కూడా మూజువాణి ఓటుతోనే ఆమోదించుకున్నారు. అనంత‌రం స‌భ‌ను బుధవారం నాటికి వాయిదా వేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష‌నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే మాట్లాడుతూ.. అయోధ్య ట్రస్ట్, విద్యార్థుల నిరసనలపై ఉభయ సభల్లో చర్చ జరపాలని కోరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రామజన్మ భూమి ట్రస్ట్, విద్యార్థులపై జరిగిన అఘాయిత్యాల వంటి అంశాలపై చర్చకు అనుమతించాలని ఉభయ సభల స్పీకర్లను కోరారు. ‘రామ జన్మభూమి ట్రస్ట్ గురించైనా, విద్యార్థులపై జరుగుతున్న అన్యాయం, అఘాయిత్యాల గురించైనా సరే, మేము కోరుతున్నదంతా చర్చ జరగడమే. వారు ఎందుకంత సంకోచిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు’ అని ఆయన అన్నారు.

పార్ల‌మెంటు ఆవ‌ర‌ణలో ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌

పార్ల‌మెంటు ఆవ‌ర‌ణలో ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌ను కొన‌సాగించాయి. ప్ల‌కార్డులు ప‌ట్టుకొని నినాదాల హోరెత్తించాయి. అయోధ్య రామ‌మందిరం విరాళాల చోరీపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని డిమాండ్ చేశారు. అలాగే కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని హర్యానాకు ఇవ్వాలని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపిలు ఆందోళ‌న చేప‌ట్టారు. భారత క్రీడా విజయాల్లో హర్యానా పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. కాబట్టి, 2030లో జరగనున్న కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశం తమకు దక్కాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళ‌న‌ల్లో కాంగ్రెస్ ఎంపి దీపీందర్ సింగ్ హుడాతో పాటు ఎంపిలు జైప్రకాశ్, వరుణ్ ముల్లానా, సత్‌పాల్ బ్రహ్మచారి, కర్మవీర్ బౌద్ధ కూడా పాల్గొన్నారు. హర్యానా మెడల్స్ తెస్తుంటే గుజరాత్‌లో క్రీడలు నిర్వహించడమేమిటని ప్రశ్నించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌‌కు సైనిక్‌ ‌స్కూల్స్‌ అప్పగింత : రాహుల్‌ ‌గాంధీ

దేశంలోని సైనిక్‌ స్కూళ్లను ప్రైవేటీకరించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సైనిక్ స్కూళ్లను ఆర్‌ఎస్‌ఎస్‌కు అప్పగిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహించారు. మంగ‌ళ‌వారం పార్ల‌మెంట్‌లో డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఈ కమిటీలో సభ్యులైన కాంగ్రెస్ ఎంపిలు రాహుల్ గాంధీ, కార్తీ చిదంబరం, పవన్ ఖేరా, టిఎంసి ఎంపి మహువా మొయిత్రా, బిజెపి ఎంపిలు రాధా మోహన్ సింగ్, సుధాన్షు త్రివేదితోపాటు పలువురు సభ్యులు హాజరయ్యారు. అయితే, రాహుల్ ఆరోపణలపై ఈ కమిటీ ఛైర్మన్, బిజెపి ఎంపి రాధా మోహన్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సైనిక స్కూళ్ల ప్రైవేటీకరణ జరుగుతుందన్న అంశంపై ప్రభుత్వం నుంచి పూర్తి నివేదిక కావాలని ఆయన కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్