-10న వెయ్యి ప్రాంతాల్లో ఎఫ్‌టిఎకి వ్యతిరేకంగా భారీ నిరసన
- 17న ప్రధాని, సిఎంలు, ప్రతిపక్ష నేతలు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు డిమాండ్ల పత్రాల సమర్పణ
- నవంబర్ 26న ఢిల్లీతో సహా వంద ప్రాంతాల్లో కిసాన్ మార్చ్
- ఎస్‌కెఎం అఖిల భారత సదస్సు నిర్ణయం
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : విద్యార్థుల ఉద్యమం తరువాత దేశవ్యాప్తంగా రైతులు వీధుల్లోకి రానున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టిఎ)ను ఉపసంహరించుకోవడం, పంటలకు స్వామినాథన్ కమిషన్ ప్రకారం మద్దతు ధర (ఎంఎస్‌పి) కల్పించడం, సమగ్ర రుణ మాఫీ, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం, విద్యుత్ ప్రైవేటీకరణ రద్దు వంటి డిమాండ్లను లేవనెత్తుతూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నవంబర్ 26న కిసాన్ మార్చ్‌లను నిర్వహించనుంది. ఢిల్లీతో సహా వంద కేంద్రాల్లో ఈ ఆందోళన నిర్వహించనున్నారు. మంగళవారం నాడిక్కడ మింటో రోడ్, సివిక్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన ఎస్‌కెఎం అఖిల భారత సదస్సు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని రైతులకు పిలుపునిచ్చింది. ఈ సదస్సు రెండు తీర్మానాలను ఆమోదించింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు సాగిన చారిత్రాత్మక రైతు పోరాటంలో అసువులు బాసిన 736 మంది రైతు అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడానికి సింఘూ సరిహద్దులో తగినంత భూమిని కేటాయించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరడం మొదటి తీర్మానం. తీవ్రమైన కరువు, వరదలు, పర్యావరణ సంక్షోభంపై, అలాగే పంటలు, పశువులు, ఇళ్లు, జీవనోపాధి నష్టాలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వ రంగ బీమా సంస్థలతో కూడిన సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థ ఆవశ్యకతపై రెండో తీర్మానం చేశారు.
దేశ వ్యతిరేక ఎఫ్‌టిఎలకు వ్యతిరేకంగా, 'క్విట్ ఇండియా' ఉద్యమ 84వ వార్షికోత్సవమైన ఆగస్టు 10న రైతులు దేశవ్యాప్తంగా 1,000 ప్రాంతాల్లో 'జైల్ భరో', 'రైల్ రోకో', 'రోడ్ రోకో' వంటి కార్యక్రమాలతో భారీ నిరసన దినాన్ని పాటించాలని పిలుపు ఇచ్చింది. దీనికి ఇతర సంఘాలు, వేదికలు మద్దతు ఇవ్వాలని, వారితో ఎస్‌కెఎం సమన్వయం చేసుకోవాలని సదస్సు నిర్ణయించింది. ఆగస్టు 17న ఎస్‌కెఎం ప్రతినిధి బృందాలు ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు డిమాండ్ల పత్రాన్ని సమర్పించి, తమ ప్రధాన డిమాండ్లపై సానుకూల చర్యలు తీసుకోవాలని కోరాలని నిర్ణయించింది. సభ్య సంఘాలన్నీ సామూహిక పాదయాత్రలు, వాహన జాతాలు, ట్రాక్టర్ ర్యాలీల వంటి స్వతంత్ర, సమన్వయ కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది. ఇవి బహిరంగ సభలు, మహా పంచాయతీలు, రాష్ట్ర స్థాయి ర్యాలీలతో ముగుస్తాయి.
అక్టోబర్ 3న 'లఖింపూర్ ఖేరీ అమరవీరుల దినోత్సవ గ్రామ మహా పంచాయతీ' జరుగుతుంది. కీలక డిమాండ్లు నెరవేరే వరకు సాగే సుదీర్ఘ పోరాటం కోసం సభ్య సంఘాలు వాలంటీర్ల జాబితాను సిద్ధం చేస్తాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి), రుణ మాఫీతో సహా 2021 డిసెంబర్ 9న ఇచ్చిన లిఖితపూర్వక హామీని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించడం కొనసాగిస్తే, డిమాండ్ల పత్రాన్ని అంగీకరించకపోతే, ఎస్‌కెఎం తన పోరాటాలను ఉధృతం చేస్తుంది. 2026 నవంబర్ 26 నుండి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా వంద ప్రాంతాలలో 'కిసాన్ మార్చ్‌లు' (రైతు యాత్రలు), అనేక రోజుల పాటు సాగే సామూహిక ఆందోళనలకు సిద్ధం కావాలని ఈ సమావేశం రైతులకు పిలుపునిచ్చింది. ఈ పోరాటాల స్వరూపం, ప్రదేశాలు, తేదీలను తగిన సమయంలో నిర్ణయిస్తామని తెలిపింది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన విజయవంతమైన విద్యార్థి పోరాట అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. అలాగే రాబోయే పోరాటాలలో విద్యార్థులు, రైతుల మధ్య మరింత ఐక్యత ఉండాలని పిలుపునిచ్చారు.
డిమాండ్లు
భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టిఎ) వద్దు, అన్ని ఎఫ్‌టిఎల రద్దు, అన్ని పంటలకు సి2+50 శాతం పద్ధతిలో ఎంఎస్‌పి, ప్రభుత్వ కొనుగోలుకు హామీనిచ్చే చట్టం చేయడం, గ్రామీణ రుణభారాన్ని, రైతులు, కూలీల ఆత్మహత్యలను అరికట్టడానికి సమగ్ర రుణ మాఫీ, ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం, నాలుగు కార్మిక చట్టాల రద్దు, కార్మికులందరికీ రూ. 26,000 కనీస వేతనం, 200 రోజుల పని, రూ. 700 వేతనంతో ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరణ, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు-2025, విత్తన బిల్లు-2025, ఎన్ఎఫ్ఎస్ఎ సవరణ బిల్లుల ఉపసంహరణ, బలవంతపు భూసేకరణ వద్దు, కార్పొరేట్ అనుకూల భూ సమీకరణ వద్దు, గిరిజనులు, గిరిజనేతర అటవీ నివాసితులకు ఎల్ఎఆర్ఆర్ చట్టం-2013, ఎఫ్ఆర్ఎ చట్టం-2006 ఆధారంగా భూ హక్కుల పరిరక్షణ వంటి డిమాండ్లను ఆమోదించింది.








కామెంట్‌లు (0)