- ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తులో వెల్లడి
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్టు 4న చోటుచేసుకున్న ఫుకెట్ - ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటనపై దర్యాప్తులో ద్రిగ్భాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రోజు విమానం నడిపిన పైలెట్ డ్రగ్స్ వినియోగించాడని, అదే మత్తులో విమానం నడిపారని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎఎఐబి) శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. పైలట్ డ్రగ్ వినియోగం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఎఎఐబి పేర్కొంది. ఈ వ్యవహారంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. నివేదిక వెలువడిన వెంటనే ఎయిర్ ఇండియా పైలట్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. కాగా ఈ ఏడాది ఆగస్ట్ 4న జరిగిన ఈ ప్రమాదంలో ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిర్ ఇండియా A320 విమానం.. ఆకాశంలోనే తీవ్ర కుదుపులకు గురైంది. ప్రయాణ సమయంలో ఒక్కసారిగా ఆకాశంలోనే విమానం దాదాపు 300 అడుగుల ఎత్తును కోల్పోయింది. దీంతో విమానంలోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ‘విమానం 36 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో మూడు హైడ్రాలిక్ వ్యవస్థలు దాదాపు ఒకేసారి పని చేయడం ఆగిపోయాయి. దీంతో విమానంలోని ఆటోపైలట్ డిస్‌కనెక్ట్ అయింది. అదే సమయంలో కొద్దిసేపు స్టాల్ వార్నింగ్ వచ్చింది. అనంతరం విమానం ఎత్తులో అనూహ్యంగా మార్పు చోటుచేసుకుంది. ఈ పరిణామంతో ప్రయాణికులు గాయపడ్డారు’ అని ఎఎఐబి తన నివేదికలో పేర్కొంది. ఘటన సమయంలో విమానంలో మొత్తం 145 మంది ఉండగా.. ఆకస్మికంగా విమానం కుదుపులకు లోనవడంతో సుమారు 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు.








కామెంట్‌లు (0)