- సిఎంఆర్‌ఎల్ - ఎగ్జాలజిక్ కేసులో సుప్రీం కోర్టు ఉత్తర్వులు
న్యూఢిల్లీ : సిఎంఆర్‌ఎల్ - ఎగ్జాలజిక్ కేసులో కేరళం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత పినరయి విజయన్, ఆయన కుమార్తె టి.వీణా, అల్లుడు, మాజీ మంత్రి పి.ఎ.మహ్మద్ రియాజ్‌లపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి కేరళం పోలీసుల దర్యాప్తుపై సుప్రీం కోర్టు బుధవారం ఏడు రోజుల పాటు స్టే విధించింది. బుధవారం కోర్టులో చర్చించిన ఈ అంశాలన్నింటినీ హైకోర్టు డివిజన్ బెంచ్ పరిశీలించాలని సుప్రీం పేర్కొంది. ‘‘ఎఫ్‌ఐఆర్‌కు మేం భంగం కలిగించం, కానీ దర్యాప్తును నిలుపుచేస్తాం. తాము పేర్కొన్న అంశాలన్నింటినీ హైకోర్టు విచారించి, నిర్ణయించేవరకు ఎలాంటి దర్యాప్తు వుండదు. ఈ కేసును తిరిగి విచారణ నిమిత్తం హైకోర్టుకు పంపుతున్నాం.’’ అని జస్టిస్ జోమాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పరిధి దాటొద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడికి)కి సూచించింది. పిఎంఎల్‌ఎ కింద తనకు గల చట్టబద్ధమైన అధికారాలను విస్తరించవద్దని ఇడికి తెలిపింది. హవాలా ఆపరేటర్లు, మాజీ ముఖ్యమంత్రులను పిఎంఎల్‌ఎ కింద విచారించేందుకు ఇడికి పూర్తి స్థాయి అధికారాలు వున్నప్పటికీ ఇతర సంస్థల చట్టబద్ధమైన పరిధుల్లోకి చొరబడరాదని స్పష్టం చేసింది. తనను, తన కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేసే అవకాశం వుందని 82 ఏళ్ల విజయన్ ఆందోళనల నేపథ్యంలో ఈ పిటిషన్‌ను విచారించడానికి దసరా సెలవుల మధ్యలో బెంచ్ సమావేశమైంది. అక్టోబరు 9న తమపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించడానికి ముందుగా తమను ప్రతివాదులుగా చేర్చలేదని, అలాగే ఏక సభ్య బెంచ్ తమ వాదనలు కూడా వినలేదని విజయన్, మరో ఇద్దరు సహ పిటిషనర్లు పేర్కొ న్నారు. అందువల్లే తాము సుప్రీంను ఆశ్ర యించాల్సి వచ్చిందని విజయన్ పేర్కొన్నారు. ఈ నెల 15న కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ సుప్రీం, వారిపై అవినీతి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందుగా విజయన్, మరో ఇద్దరు పిటిషనర్లు పెట్టుకున్న పిటిషన్లను విచారిం చాల్సిందిగా డివిజన్ బెంచ్‌ను ఆదేశించింది. ఒక వ్యక్తి ఎంత చిన్న స్థాయిలో వున్నా లేదా పెద్ద స్థాయిలో వున్నా ఆ వ్యక్తి చట్టబద్ధ పాలన, సహజ న్యాయ సూత్రాలకు లోబడి వుంటాడని జస్టిస్ బాగ్చి గుర్తు చేశారు. పిటిషనర్లపై నమోదైన తదుపరి ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్) చెల్లు బాటుపై బెంచ్ ఎలాంటి అభిప్రాయాలను నమోదు చేయలేదు. చట్టానికి అనుగుణంగా ఇసిఐఆర్‌ను సముచిత వేదిక ఎదుట సవాలు చేసుకునే స్వేచ్ఛను కోర్టు వారికి ఇచ్చింది. పిఎంఎల్‌ఎ కింద తనకు గల చట్టబద్ధమైన అధికారాలను విస్తరించవద్దంటూ ఇడికి న్యాయమూర్తి సూచించారు. హవాలా ఆపరేటర్లు, మాజీ ముఖ్యమంత్రులను పిఎంఎల్‌ఎ కింద విచారించేందుకు ఇడికి పూర్తి స్థాయి
అధికారాలు వున్నప్పటికీ ఇతర సంస్థల చట్టబద్ధమైన పరిధుల్లోకి చొరబడరాదని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రిని విచారించేందుకు 1988 నాటి చట్టంలోని సెక్షన్ 17ఎ కింద ప్రభుత్వం నుండి పోలీసులు ముందస్తు అనుమతి తీసుకున్నారా లేదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల మేరకే ఎఫ్‌ఐఆర్‌పై దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడాన్ని కూడా బెంచ్ సరిదిద్దింది. ఇడి ఇచ్చిన సమాచారం ప్రాతిపదికన జరుగుతున్న దర్యాప్తు ఇదని జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారు. పిటిషనర్ల అప్పీళ్ళపై విచారణ జరిగేటపుడు బుధవారం కోర్టులో చర్చించిన ఈ అంశాలన్నింటినీ కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ పరిశీలించాలని సుప్రీం పేర్కొంది. ‘‘మేం ఎఫ్‌ఐఆర్‌ను కొనసాగిస్తాం. ఈ అంశాలన్నింటినీ హైకోర్టు విచారించి, నిర్ణయించేవరకు ఎలాంటి దర్యాప్తు వుండదు.’’ అని దాదాపు గంట పాటు సాగిన విచారణలో జస్టిస్ బాగ్చి స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)