- జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్
రాంచీ : ఆందోళన చేస్తున్న విద్యార్థులతో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు. అలాగే, విద్యార్థుల డిమాండ్ మేరకు పటిష్టమైన సంస్కరణలు తీసుకురానున్నట్లు చెప్పారు. రాంచీలోని అసెంబ్లీ ప్రాంగణంలో శుక్రవారం సోరెన్ మీడియాతో మాట్లాడారు. జార్ఖండ్ పిఎస్‌సి, ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో అక్రమాలపై కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులతో చర్చలు జరిపేందుకు తమ ప్రభుత్వం ఇప్పటికే మంత్రులు దీపికా పాండే సింగ్, సుదివ్య కుమార్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు 11 మంది సభ్యులతో మరోక ప్రతినిధి బృందాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే చర్చల విషయంపై తమకు అధికారికంగా ప్రభుత్వం నుంచి ఆహ్వానం రాలేదని విద్యార్థులు తెలిపారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనలు 14వ రోజు అయిన శుక్రవారం కూడా కొనసాగాయి. ఆరుగురు నిరాహార దీక్ష కొనసాగిస్తుండగా, రెండు విద్యార్థి సంఘాలు విధానసభ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించాయి.







కామెంట్‌లు (0)