మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనివాసం ప్రజల హక్కు...నేరం కాదు

2 గంటల క్రితం

DELHI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 11:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఢిల్లీలో పేదల ఇళ్ల తొలగింపుపై ప్రజాగ్రహం

  • వామపక్షాలు, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జంతర్‌‌మంతర్‌ ‌వద్ద ఆందోళన

  • బుల్డోజర్ కూల్చివేతలు నిలిపి..పునరావాసం కల్పించాలని డిమాండ్‌

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ​దేశంలో కాస్త గూడు ఏర్పాటు చేసుకొని అందులో నివసించడమనేది ప్రజలందరి హక్కు అని, ప్రభుత్వ స్థలాల్లో గూడు ఏర్పాటు చేసుకోవడం నేరం కాబోదని పలువురు నేతలు నినదించారు. ఒక వేళ ప్రభుత్వ స్థలాల నుంచి పేదల నివాసాలను తొలగించాల్సివస్తే..ముందస్తుగా న్యాయమైన నష్ట పరిహారం చెల్లించి.. పునరావాసం కల్పించిన తర్వాతే తొలగించాల్సివుంటుందని స్పష్టం చేశారు. వామపక్షాలు, ప్రజాసంఘాల ఐక్యవేదిక ‘ఆవాస్ అధికార్ జన్ ఆందోళన్’ (నివాస హక్కుల ప్రజా ఉద్యమం) ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం నాడు ఢిల్లీలోని జంతర్‌‌మంతర్‌ ‌వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దేశ రాజధాని ప్రాంతం పరిధిలో మురికివాడల (స్లమ్స్) తొలగింపులు, బలవంతంగా ఖాళీ చేయించడం, పరిహారం-పునరావస హక్కులు నిరాకరించడం వంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసించారు.

బుల్డోజర్ కూల్చివేతల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, గౌరవప్రదమైన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపి అమ్రారామ్ మాట్లాడుతూ ఢిల్లీతో సహా బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ పేదలను వెళ్లగొట్టి..ఆయా భూములను కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమ‌ర్శించారు. పేదలను వెళ్లగొట్టడానికి బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారని విమ‌ర్శించారు. ‘బిజెపి ప్రభుత్వం నా బస్నీ గ్రామంలో కూడా ఇళ్లను కూల్చివేయడానికి ప్రయత్నించింది. నా శరీరంపై బుల్డోజర్‌ను నడిపిన తర్వాతే ఇళ్లను కూల్చివేయగలరని నేను గట్టిగా నిలబడ్డాను. ఫలితంగా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రభుత్వం కేవలం పోరాటంతోనే వెనక్కి తగ్గుతుందని ఇది స్పష్టం చేస్తోంది’’ అని అమ్రారామ్ అన్నారు. ఢిల్లీ నుండి జైసల్మేర్ వరకు బిజెపి ప్రభుత్వం పేద శ్రామికులను వారి ఇళ్ల నుండి తొలగిస్తూనే, లక్షలాది ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోందని విమర్శించారు. కొద్ది రోజుల క్రితమే జంతర్ మంతర్ వేదికగా జరిగిన ఆందోళన ఒక కేంద్ర మంత్రి రాజీనామాకు దారితీసిందని గుర్తుచేసిన ఆయన, పేదలకు వ్యతిరేకమైన ఈ తొలగింపు విధానాన్ని ఆపకపోతే ప్రజా ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు.

సిపిఐ ఎంపి సంతోష్ కుమార్ మాట్లాడుతూ పేదరికాన్ని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం..ఆ దిశగా కృషి చేయకుండా..ఏకంగా పేదలనే తొలగించే దుర్మార్గపు విధానాలు అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, ఢిల్లీలోని రేఖా గుప్తా ప్రభుత్వం పెద్ద కార్పొరేట్లు, శక్తివంతుల ప్రయోజనాలను కాపాడుతూనే, పేదల ఇళ్లను కూల్చివేస్తున్నాయని ఆయన అన్నారు. సిపిఐఎంఎల్ ఎంపి రాజా రామ్ మాట్లాడుతూ బంకీపూర్ (బీహార్), దతియా (మధ్యప్రదేశ్) ఉప ఎన్నికల ఫలితాలతో బిజెపి ఆధిపత్య క్షీణత మొదలైందన్నారు. అభివృద్ధి ముసుగులో పేదలను వెళ్లగొట్టే చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సిపిఐఎంఎల్‌ నాయకురాలు సుచేతా దే అన్నారు.

సిపిఎం మాజీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ మాట్లాడుతూ "ఈనాడు బిజెపికి కమలంతో కాదు, బుల్డోజర్‌తోనే గుర్తింపు వచ్చింది. పేదల ఇళ్లను కూల్చివేయడం, వారి హక్కులను కాలరాయడం దాని రాజకీయాలకు నిర్వచనాత్మక చిహ్నంగా మారింది" అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్ వర్మ, ఆర్ఎస్ దాగర్ (ఆర్‌ఎస్‌పి), బిర్జు (సిజిపిఐ), రంజీత్ తివారీ ( సోనియా విహార్ సంఘర్ష్ సమితి) తదితరులు ప్రసంగించారు. ఈ ఆందోళ‌న‌లో సిపిఎం సీనియర్ నాయ‌కులు బృందా కరత్, ఢిల్లీ రాష్ట్ర కార్య‌ద‌ర్శివ‌ర్గ‌ సభ్యులు రాజీవ్ కున్వర్, పివి అనియన్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఇళ్లను అక్రమంగా కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు కూడా ప్రధానమంత్రికి, కేంద్ర హోం మంత్రి, కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించాయి. అన్ని రకాల కూల్చివేతలు, బలవంతపు ఖాళీల‌ను తక్షణమే నిలిపివేయాలని, అలాగే ప్రభావితమైన కుటుంబాలన్నింటికీ గౌరవప్రదమైన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశాయి.

DELHI 2

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్