మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నాగాలాండ్‌లో వర్షబీభత్సం

2 రోజుల క్రితం

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 12:32 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- 9 మంది మృతి

- దేశవ్యాప్తంగా సుమారు 30 మందికిపైగా మృతి

- అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

కోహిమా : నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో దేశవ్యాప్తంగా సుమారు 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రాబోయే వారం రోజు పాటు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి

భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. నాగాలాండ్‌ మోన్‌ జిల్లాలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి చెందారు. డజన్ల కొద్ది గల్లంతయ్యారు. పది నుంచి పదిహేను ఇళ్లు దెబ్బతినగా శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలను ముమ్మరం చేశాయి. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టు తెలుస్తోంది.

భారీ వర్షాల కారణంగా అసోం గౌహతి లోని ఖార్ఘులి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ పైభాగంలో ఉన్న ఓ రక్షణ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పశ్చిమ బెంగాల్‌లో కూడా రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. డార్జిలింగ్, కాలింపాంగ్, జల్‌పాయ్‌గుడీ , అలీపుర్‌దువార్, కూచ్ బెహర్ జిల్లాల్లో తీస్తా, తోర్సా, జల్దఖా, రైడక్ నదుల నీటిమట్టాలు ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉత్తరాఖండ్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు

ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. హరిద్వార్ జిల్లాలో పిడుగులు పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేని వానలు, కొండచరియలు విరిగిపడిన వంటి ఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా 84 రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. కుంభవృష్టి వర్షాలకు రిస్పానా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఫలితంగా దాలన్‌వాలా సహా పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రానున్న కొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఉత్తరాఖండ్‌లోని 10 జిల్లాలకు అధికార యంత్రాంగం రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది.

కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 17 మంది మృతి

జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 17 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకున్న పలువురిని రెస్య్కూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ఆకస్మిక వరదలకు ఇళ్లు, కార్లు, రహదారులు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు చినాబ్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద వచ్చి చేరుతుండటంతో సలాల్ డ్యామ్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

డ్యామ్‌ నుంచి చినాబ్‌ నది పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా సీఎం ఒమర్‌ అబ్లుల్లా తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పహల్గాం, బల్తాల్ మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అమర్‌నాథ్ యాత్ర అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బల్తాల్, నున్వాన్‌, చందన్‌వాడి బేస్ క్యాంపులతో పాటు జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి భక్తులు ముందుకు వెళ్లకుండా నిషేధం విధించారు. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం మాతా వైష్ణోదేవి యాత్రను కూడా అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్