- టిడిపి ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నదుల అనుసంధానం నుంచి సైబర్ మోసాల వరకు చర్చించాలని టిడిపి ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. అఖిలపక్ష సమావేశంలో పలు కీలక జాతీయ, రాష్ట్ర అంశాలను ప్రస్తావించినట్లు తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, దేశంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నదుల అనుసంధానంపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా గోదావరి-పెన్నా లింకేజ్ ప్రాజెక్టును వేగవంతం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా నదుల అనుసంధానంపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిపారు. రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు దేశంలోనే ప్రముఖ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరినట్లు చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా, వ్యక్తిగత హననాన్ని అరికట్టేందుకు అవసరమైన కొత్త చట్టాలపై చర్చకు కోరినట్లు తెలిపారు. పెరుగుతున్న సైబర్ మోసాలు, మ్యూల్ అకౌంట్లు, షెల్ కంపెనీల సమస్యను కూడా ప్రస్తావించినట్లు చెప్పారు.
రైతుల సమస్యలు, ఆక్వా సంక్షోభంపై చర్చించాలి : వైసిపి
రైతుల సమస్యలు, ఆక్వా సంక్షోభంపై చర్చించాలని వైసిపి ఎంపి వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశంలో రాష్ర్టానికి సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించాలని కోరారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై పార్లమెంట్‌లో తగిన సమయం కేటాయించి చర్చించి, కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పొగాకు, తోతాపురి మామిడి, అరటి, మొక్కజొన్న రైతులు ధరలు లేక నష్టపోతున్నారని చెప్పారు. ఫీడ్ కంపెనీల ఆధిపత్యం వల్ల రైతులపై అదనపు భారం పడుతోందని పేర్కొంటూ, ఈ అంశంపై కూడా పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో నిర్వహించిన మెగా డిఎస్‌సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన ఆయన, ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియపై కూడా పార్లమెంట్‌లో చర్చ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో పట్టణ నిరుద్యోగం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దళితులపై దాడులు, పోలీసుల వేధింపులు, లాకప్ మరణాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దని కోరారు.
విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను అమలు చేయాలి : బాలశౌరి
రాష్ట్ర విభజన చట్టంలో పెండింగ్ హామీలను త్వరితగతిన అమలు చేయాలని జనసేన ఎంపి వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతాంగ సమస్యలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరపాలని కోరారు. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా రాష్ర్టానికి తగిన నిధులు కేటాయించాలని కోరామన్నారు. అమరావతిపై వైసిపి నేతలు చేస్తున్న విమర్శలను బాలశౌరి ఖండించారు. సిఆర్‌డిఎ పరిధిలోని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.








కామెంట్‌లు (0)