లక్నో : ఉత్తరప్రదేశ్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సమాజ్వాదీ పార్టీ (ఎస్పి ) అభ్యర్థులుగా ప్రకటించిన రామ్ గోపాల్ యాదవ్, ధనరాజ్ పరిమల్ నత్వానీలు బుధవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో వారు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు ఎస్పి సోషల్మీడియా ‘ఎక్స్’లో వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్కు చెందిన తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం నవంబర్ 25తో ముగియనుండటంతో ఎన్నికలు జరగనున్నాయి. మరో స్థానం మాజీ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ రాజీనామాతో ఖాళీగా ఉంది. దీంతో మొత్తం పది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరీ, బీఎల్ వర్మ, బిజెపి నేతలు అరుణ్ సింగ్, గీతా శాక్య, నీరజ్ శేఖర్, బ్రిజ్లాల్, సీమా ద్వివేది, ఎస్పికి చెందిన రామ్ గోపాల్ యాదవ్, బిఎస్పికి చెందిన రాంజీ గౌతమ్ పదవీకాలం ముగియనుంది. కేంద్ర మంత్రులుగా కొనసాగాలంటే హర్దీప్ సింగ్ పూరీ, బీఎల్ వర్మ తిరిగి రాజ్యసభకు ఎన్నిక కావాల్సి ఉంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులైన మాజీ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ రాజ్యసభకు రాజీనామా చేయడంతో మరో స్థానం ఖాళీగా ఉంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుత పార్టీల బలాబలాల ప్రకారం బిజెపి నేతృత్వంలోని కూటమి ఎనిమిది స్థానాలు, కాంగ్రెస్ మద్దతుతో ఎస్పి రెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అయితే అందుబాటులో ఉన్న స్థానాల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఎన్నిక అనివార్యమవుతుంది. ఈ క్రమంలో క్రాస్ ఓటింగ్ కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 6 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. అక్టోబర్ 7న నామినేషన్ల పరిశీలన, 9న ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. అక్టోబర్ 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2024 రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి బిజెపికి చెందిన ఎనిమిది మంది, ఎస్పికి చెందిన జయా బచ్చన్, రామ్జీ లాల్ సుమన్ విజయం సాధించారు. ఎస్పి మూడో అభ్యర్థిగా మాజీ ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అలోక్ రంజన్ను బరిలోకి దింపినప్పటికీ ఆయన ఓటమి పాలయ్యారు.








కామెంట్లు (0)