మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌ఎఫ్‌ఐ మహిళా కార్యకర్తలపై సంఘ్‌పరివార్‌ గూండాల దాడి

1 రోజు క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 10:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- డియు ఎన్నికల ప్రచారంలో ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి మూకల దుశ్చర్య

- ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షులు నాదియాతో సహా పలువురికి గాయాలు

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘం (డియుఎస్‌యు) ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ మహిళా కార్యకర్తలపై సంఘ్‌పరివార్‌ మూకలు దాడికి పాల్పడ్డాయి. యూనివర్శిటీ పరిధిలోని కమలా నెహ్రూ కాలేజీ, శ్యామ్‌లాల్‌ కాలేజీ, అరబిందో కాలేజీ, పిజిడిఎవి కాలేజీ, దేశ్‌బంధు కాలేజీల్లో ప్రచారం చేస్తుండగా ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి గూండాలు ఈ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షులు నాదియాతో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర స‌హాయ కార్య‌ద‌ర్శులు మెహిన్‌ ఫాతిమా, అనన్య, ఉపాధ్య‌క్షులు సిమ్రాన్‌, ఎస్ఎఫ్ఐ దీపాంషి, స్టాన్సీ తదితరులపై కూడా దాడి జరిగింది. ఈ వివరాలను ఆదివారం నిర్వహించిన విలేక‌రుల స‌మావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వెల్లడించారు. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తుండగా పలు కాలేజీల్లో దాడులు జరిగాయని, దాడులకు పాల్పడ్డ వారు యూనివర్శిటీ విద్యార్థులు కాదని, బయట నుంచి వచ్చిన ఎబివిపి గూండాలని తెలిపారు. ఈ దాడులపై పోలీసులను ఆశ్రయించినప్పటికీ కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారని తెలిపారు. ఒక కాలేజీలో జరిగిన ఒంటరి ఘటనగా దీనిని చూడలేమని, పలు కాలేజీల్లో ఒకే తరహాలో దాడులు జరగడం వెనుక ముందస్తు ప్రణాళిక ఉందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పేర్కొన్నారు. మహిళలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటేనే ఎబివిపి భయపడుతోందని విమర్శించారు. విద్యార్థి ఎన్నికల్లో తమ రాజకీయ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడం, ప్రచారం నిర్వహించడం ప్రజాస్వామ్య హక్కులని, వాటిని అడ్డుకునేందుకు దాడులకు పాల్పడటం దుర్మార్గమని విమర్శించారు. కాగా, ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు ఈ నెల 18న జరగనున్నాయి. గతేడాది ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ తన ఓటు శాతాన్ని గణనీయంగా పెంచుకుంది. ఈసారి ఎన్నికలకు ఎస్‌ఎఫ్‌ఐ విస్తృత ప్రచారాన్ని ప్రారంభించింది. విద్యార్థుల్లో ఎస్‌ఎఫ్‌ఐకి పెరుగుతున్న ఆదరణను చూసి ఎబివిపి, సంఘ్‌పరివార్‌ భయాదోళనకు గురవుతున్నాయని, అందుకే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్