మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Sambhal violence : ఎన్‌ఎస్‌ఎ నిర్బంధం కొట్టివేత.. యుపికి రూ.10 లక్ష‍ల జరిమానా

14 గంటల క్రితం

Sambhal violence
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 03:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : 2024 సంభాల్‌ హింసాకాండ కేసు నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద విధించిన నిర్బంధాన్ని సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. నిర్బంధ అధికారాన్ని ‘చట్టవిరుద్ధంగా వినియోగించారు’ అని పేర్కొంటూ, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.10 లక్ష‍ల జరిమానా విధించింది. 2025 అక్టోబర్‌లో సంభాల్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ ఇచ్చిన నిర్బంధపు ఆదేశాలను జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ షీల్‌ నాగులతో కూడిన ధర్మాసనం పక్కన పెట్టింది.

‘‘నిర్బంధపు అధికారాన్ని చట్టవిరుద్ధంగా వినియోగించారు. నిర్బంధాన్ని విధించిన అధికారులు తగిన అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. 2025 అక్టోబర్‌ 13న జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వు రద్దు చేయబడింది. రాష్ట్రంపై రూ.10 లక్ష‍ల జరిమానా విధించాం’’ అని తీర్పులోని కీలక భాగాన్ని వెల్లడిస్తూ ధర్మాసనం పేర్కొంది. 2024 నవంబర్‌ 24న కోర్టు ఉత్తర్వుల మేరకు సంభాల్‌లోని షాహి జామా మసీదు సర్వే చేపడుతుండగా చెలరేగిన హింసాకాండలో నలుగురు వ్యక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి యుపి పోలీసులు ముల్లా అఫ్రోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తనపై ఎన్‌ఎస్‌ఎ చట్టాన్ని ప్రయోగించడాన్ని సవాలు చేస్తూ అఫ్రోజ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

తన కక్ష‍ిదారుడిని 2025 జనవరి 17న అదుపులోకి తీసుకున్నారని, బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేస్తామని బెదిరించి బలవంతంగా నేరాన్ని అంగీకరించేలా చేశారని అఫ్రోజ్ తరపు న్యాయవాది దివ్యేష్‌ ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు. అఫ్రోజ్‌పై పోలీసులు నమోదు చేసిన కేసు పూర్తిగా, కస్టడీలో ఉన్నప్పుడు ఆయన చేసినట్లుగా చెబుతున్న అంగీకార వాంగ్మూలం, ఆయన సూచన మేరకు 32-బోర్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారన్న అంశంపైనే ఆధారపడి ఉందని ఆయన వాదించారు. అఫ్రోజ్‌ హత్య చేశారన్న వ్యక్తికి అయిన గాయాలు అతని నుండి స్వాధీనం చేసుకున్న 32-బోర్‌ పిస్టల్‌వి కాదని, 315-బోర్‌ ఆయుధానివని తెలిపారు.

అఫ్రోజ్ కస్టడీలో ఉండగా, సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ 1980, జాతీయ భద్రతా చట్టంలోని సెక్షన్ 3(2)ను ప్రయోగించి, అక్టోబర్ 13, 2025న ఆయనను నిర్బంధంలో ఉంచాలని ఆదేశించారు. అనంతరం ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సమర్పించిన విజ్ఞప్తులను కూడా తిరస్కరణకు గురయ్యాయి. తిరస్కరించబడ్డాయి.

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 2025, నవంబర్ 8న ఈ నిర్బంధ ఉత్తర్వును ధృవీకరిస్తూ, అఫ్రోజ్ 2026, అక్టోబర్ 12 నిర్బంధంలోనే ఉండాలని ఆదేశించింది. తన నిర్బంధాన్ని సవాలు చేస్తూ అఫ్రోజ్‌ అలహాబాద్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2026, జూన్‌ 8న ఈ అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. దీంతో అఫ్రోజ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్