సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వరద బాధితులపై పిస్టల్ గురిపెట్టిన ఎస్ఐ

1 గంట క్రితం

SI suspended
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 12:41 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

పాట్నా : వరదల్లో సర్వం పోగొట్టుకుని, సహాయక సామగ్రి కోసం వరుసలో నించున్న బాధితులపై సారన్‌ జిల్లా మేకర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఒ, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంగ్రామ్‌ కుమార్‌ సింగ్‌ పిస్టల్ గురిపెట్టారు. రేవా ఘాట్‌ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న హాయక సామగ్రి కోసం వరద బాధితులు వరుసలో నిల్చున్నారు. అయితే కొందరు బాధితులు రేషన్‌ తీసుకునేందుకు వరుస నుంచి బయటకు రావడంతో ఎస్‌ఐ వారిపై వాగ్వివాదానికి దిగారు. వారికి మొదట తన పాదరక్షలను చూపించారు. అనంతరం పిస్టల్‌ను గురిపెడుతూ వారిపై బెదిరింపులకు దిగారు.


ఈ ఘటనపై ప్రతిపక్ష ఆర్‌జెడి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. సామన్య ప్రజల పట్ల అధికారులు, పోలీసులు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. వరద బాధితులకి ముందుగా చెప్పును చూపించారు, ఆ తర్వాత అహంకారంతో పిస్టల్‌ను గురిపెట్టారు. ముఖ్యమంత్రి ఎలా వ్యవహరిస్తున్నారో, పోలీసులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇంతటి అహంకారం, దర్పం ఎక్కడి నుండి వచ్చాయని నిలదీశారు. ఒకరు ఎకె-47తో కాల్పులు జరుపుతారని, మరొకరు పిస్టల్‌ను గురిపెడతారని అన్నారు. బిజెపి-జెడియు నేతృత్వంలోని ప్రభుత్వంలో నేతలు, అధికారులు, పోలీసులు సామాన్య ప్రజలను పురుగుల మాదిరిగా చూస్తున్నారని దుయ్యబట్టింది.


వీడియో వైరల్‌ కావడంతో ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు తీసుకుంది. ఎస్‌ఐని సస్పెండ్‌ చేస్తున్నట్లు సారన్‌ అదనపు ఎస్‌పి రోషన్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, క్రమశిక్షణారాహిత్యం, నిరంకుశ వైఖరిని ప్రదర్శించినందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సస్పెన్షన్‌ కాలంలో అతనిని పోలీసు ప్రధాన కార్యాలయంలో నియమించి, జీవనభృతి చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. వరదల నిర్వహణలో నిర్లక్ష్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఏడుగురు ఇంజినీర్లను ప్రభుత్వం సస్పెండ్‌ చేయడంతో పాటు మరో అధికారిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.


ఇటీవల నేపాల్‌ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో గండక్‌ నదిలో నీటిమట్టం పెరిగి కట్టలు తెగిపోవడంతో బీహార్‌లోని ఆరు జిల్లాల్లో భారీగా వరదలు సంభవించాయి. పశ్చిమ చంపారన్‌, తూర్పు చంపారన్‌, గోపాల్‌గంజ్‌, సారన్‌, దర్భంగా, ముజఫర్‌పూర్‌ జిల్లాల్లోని 30 బ్లాకుల పరిధిలో 169 గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 9.87 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్