గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసారీ ఆలస్యమైంది.. అచ్ఛే దిన్‌ కోసం వెతుక్కుంటున్నా!

1 గంట క్రితం

G--Untitled-desig
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 12:01 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సోషల్‌ మీడియాలో 11వ తరగతి విద్యార్ధిని ప్రసంగం వైరల్

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని స్ప్రింగ్‌‌డేల్స్‌ ‌స్కూల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్ధిని కియారా అగర్వాల్‌ ‌జైపూర్‌‌లో అంతర పాఠశాలల పోటీలో చేసిన రాజకీయ ప్రసంగం సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయింది. ‘సారీ ఆలస్యమైంది, అచ్చే దిన్‌ (‌మంచి రోజులు) వస్తాయనుకుంటూ వెతుక్కుంటున్నాను’ అంటూ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలతోటే ఆమె ప్రసంగం ఆరంభమైంది. ‘సైమన్‌ ‌గో బ్యాక్‌, ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌’ అంటూ స్వాతంత్ర్య ఉద్యమ కాలం నాటి నినాదాలను గుర్తు చేసుకుంటూ ఈనాటి రాజకీయ నినాదాలు అందుకు పూర్తి విరుద్ధంగా వున్నాయని, ప్రజల్లో కావాల్సిన మార్పు తీసుకురావడంలో విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి నినాదాలు ఓటు బ్యాంకును సృష్టించడం కాదు, విప్లవాలను తీసుకువచ్చాయని అన్నారు. కానీ నేటి తరం యువత రీల్స్‌ ‌చేయడంలో బిజీగా వుంటున్నారని ఆమె పేర్కొంది. ఈనాటి నినాదాలు సమస్య కాదు, కానీ ఆచరణాత్మక మార్పు లేనపుడు అదే పెద్ద సమస్యగా మారుతుందని అన్నారు.

పదే పదే సందేశాలు పంపడం వల్ల భ్రమనే నిజంగా భావించే పరిస్థితి తలెత్తుతుంది, అంటే మనకు పరిచయమున్నదే నిజమని భావిస్తాం, కానీ అసలైన సమస్యలు పరిష్కరించబడకుండానే మిగిలిపోతున్నాయని అన్నారు. కియారా తన ప్రసంగంలో కొన్ని ప్రభుత్వ పథకాల పేర్లను వ్యంగ్యంగా మార్చి చెప్పారు. బేటీ బచావో, బేటీ పడావో బదులుగా ‘అంకుల్‌ ‌పడావో, బేటీ బచావో’ అనాలని అన్నారు. నీట్‌ ‌పేపర్ల లీకేజీల నేపథ్యంలో మేక్‌ ఇన్‌ ఇండియా బదులు ‘లీక్ ఇన్‌ ఇండియా’ అనాలన్నారు. రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి సినిమాలు ఎలా ఒక మాధ్యమంగా మారాయో కూడా ఆమె ప్రస్తావించారు. "కొన్నిసార్లు ధురందర్‌లో ప్రధానమంత్రి అతిథి పాత్రలో కనిపిస్తారు, మరికొన్నిసార్లు రణ్‌వీర్ తుపాకులు పేలుస్తూ ఉంటాడు," అని ఆమె పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా 'స్నేహితుల'తో ప్రధాని మోదీ జెన్-జెడ్ ను చేరుకుంటున్నారని కూడా ఆమె పేర్కొన్నారు. "ఈ రోజు మనం కేవలం పౌరులం కాదు, ఒక నాటకంలో ప్రేక్షకులం," అని ఆమె అన్నారు. ప్రధానిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు పోలీసుల చర్యను ఎదుర్కొని, బహిరంగ క్షమాపణ చెప్పేలా చేసిన 15 ఏళ్ల బాలికపై కేసును అగర్వాల్ ప్రస్తావించారు. యువతులపై తీవ్రమైన నేరాల కేసులలో ఎందుకు ఇంతటి తక్షణ స్పందన చూపడం లేదని ఆమె నిలదీశారు. క్షేత్రస్థాయిలో చేయాల్సిన అసలు పనిని పక్కన పెట్టి, ప్రజా సంబంధాలు మరియు మార్కెటింగ్‌పై భారీగా ఖర్చు చేయడాన్ని కూడా ఆమె విమర్శించారు. రాజకీయ ప్రజా సంబంధాలు, సోషల్‌ ‌మీడియా ప్రచారాలు, రాజకీయ సందేశాల కోసం చలన చిత్రాలను, సెలబ్రిటీలను ఉపయోగించడాన్ని ఆమె ప్రశ్నించారు. ఆమె ప్రసంగంలోని కొన్ని భాగాలు సోషల్‌ ‌మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. రాజకీయ నేతల దృష్టిని కూడా ఆకర్షించాయి. మొత్తమ్మీద, ఆ విద్యార్ధిని తన ప్రసంగంలో పలు రాజకీయ వ్యంగ్యాస్త్రాలను ప్రయోగించడం, అలాగే ప్రభుత్వం పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్‌‌ను ప్రశ్నిస్తూ అనేక ప్రశ్నలు సంధించడంతో ఈ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్