శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పాఠశాలల రక్ష‍ణ ఉద్యమం బలోపేతం

1 గంట క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 12:48 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రతి బడికీ నివేదిక : ఎస్‌ఎఫ్‌ఐ

- ప‌ది కోట్ల సంత‌కాల సేక‌ర‌ణ‌

- దశలవారీ ఉద్యమ కార్యాచరణ

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : పాఠశాలల రక్ష‍ణకు, మౌలిక సదుపాయాలతో వాటిని మరింత మెరుగైన స్థితిగతులతో రూపుదిద్దు కునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఉద్యమాన్ని మరింత బలోపేతంగా చేపట్టనుంది. గతేడాది డిసెంబర్‌లో ‘స్కూల్‌ బచావో’ పేరుతో ఎస్ఎఫ్‌ఐ తన ఆందోళనను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేపట్టే క్రమంలో అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలను సందర్శించి ప్రతి బడికి ఒక నివేదిక తయారు చేయనున్నారు. శుక్ర‌వారం నాడిక్క‌డ హ‌రి కిష‌న్ సింగ్ సుర్జీత్ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య, ఉపాధ్యక్షులు సుభాష్ జాఖర్, కేంద్ర కమిటీ సభ్యులు సూరజ్ ఇలామన్, కాంతి కుమారి, ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షురాలు నాడియా వివరాలను ఈ మేరకు వివరాలను వెల్లడించారు. పాఠశాలల మూసివేత, విలీనాల కారణంగా చదువులకు ఆటంకం కలిగిన విద్యార్థులను గుర్తించి, వారిని సంఘటితం చేస్తామ‌ని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, మూసివేసిన పాఠశాలలను తిరిగి తెరవడానికి స్థానికులను భాగస్వాములను చేస్తూ ఆందోళ‌నలు చేప‌డ‌తామ‌ని అన్నారు. ఈ ఆందోళనలో భాగంగా పది కోట్ల సంతకాలు సేకరిస్తామ‌ని, పాఠశాలల దుస్థితికి సంబంధించి బ్లాక్, సబ్-డివిజన్, జిల్లా స్థాయి కార్యాలయాలకు వినతిపత్రం అంద‌జేస్తామ‌ని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సమావేశాలు, సభలు, రాజ్‌భవన్‌ మార్చ్‌లు నిర్వహిస్తామ‌ని, అక్షరాస్యతా దినోత్సవమైన సెప్టెంబర్ 8న ఢిల్లీలో తొలి సమావేశం నిర్వహిస్తామ‌ని అన్నారు. ‘‘ప్రభుత్వ విద్యా వ్యవస్థకు మరిన్ని నిధులు కేటాయించడం, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయడం, మూసివేసిన అన్ని ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరవడం, 1:20 నిష్పత్తిలో ఉపాధ్యాయులను నియమించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, బడి మానేసే వారిని నివారించడానికి చర్యలు తీసుకోవడం’’ వంటివి తమ ప్రధాన డిమాండ్లని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ ప్రచురణ 'స్టూడెంట్స్ స్ట్రగుల్' ప్రత్యేక సంచికను కూడా విడుదల చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్