1978 తీర్పును పక్కనపెట్టిన సుప్రీంకోర్టు
జస్టిస్ నాగరత్న సహా ముగ్గురు న్యాయమూర్తుల అసమ్మతి
న్యూఢిల్లీ: కార్మికులకు అనుకూలంగా ఉన్న 1978 నాటి 'పరిశ్రమ' విస్తృత నిర్వచనం, కొత్తగా అమల్లోకి వచ్చిన పారిశ్రామిక సంబంధాల కోడ్-2020కి వర్తించదని సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. అయితే ఈ అంశంపై న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
వివాదం ఏమిటి?
జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ రాసిన 1978నాటి బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వర్సెస్ ఏ రాజప్ప కేసులో ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 'పరిశ్రమ'కు విస్తృత నిర్వచనం ఇచ్చింది. ఈ తీర్పు వల్ల ఉద్యోగుల్లో అనేకమందికి సామూహిక బేరసారాలు సహా న్యాయపరమైన రక్షణ లభించింది. న్యాయవ్యవస్థ, శాంతిభద్రతలు, రక్షణ వంటి కీలక సార్వభౌమ కార్యకలాపాలను మాత్రమే ఇందులో నుంచి మినహాయించారు. ఈ తీర్పు ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మున్సిపాలిటీలను కూడా 'పరిశ్రమ' పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ తీర్పు ‘ట్రిపుల్ టెస్ట్’ ప్రవేశపెట్టింది.. ఏదైనా కార్యకలాపం క్రమబద్ధంగా, యజమాని-ఉద్యోగి సహకారంతో నడుస్తూ, మానవ అవసరాలను తీర్చే వస్తు, సేవల ఉత్పత్తికి సంబంధించినదైతే అది ‘పరిశ్రమ’ పరిధిలోకి వస్తుందని పేర్కొంది.
నవంబర్ 2025లో అమల్లోకి వచ్చిన పారిశ్రామిక సంబంధాల కోడ్‌లోని సెక్షన్ 2(పి) కింద ‘పరిశ్రమ’ నిర్వచనం, 1947 నాటి పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 2(జె)పై 1978 తీర్పు వ్యాఖ్యానంతో ముడిపడి ఉండాల్సిన అవసరం లేదని ధర్మాసనంలోని మెజారిటీ న్యాయమూర్తులు తేల్చిచెప్పారు. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ మెజారిటీ అభిప్రాయాన్ని రాశారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీ ఆయనకు మద్దతు తెలిపారు. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి తమ వేర్వేరు అభిప్రాయాల్లో దీనితో ఏకీభవించారు. ‘‘సెక్షన్ 2(పి) కింద ‘పరిశ్రమ’ భవిష్యత్తు, పారిశ్రామిక వివాదాల చట్టంలోని 2(జె) వ్యాఖ్యానంతో ముడిపడి ఉండదు’’ అని దాదాపు గంటసేపు సాగిన తీర్పు వెలువరింపు సందర్భంగా సిజెఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అయితే, ఐఆర్‌సికి ముందు కోర్టులు, ట్రిబ్యునళ్లు, కార్మిక అధికారుల ముందు పెండింగ్‌లో ఉన్న కేసులకు మాత్రం 1978 తీర్పే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసుల్లో బిడబ్ల్యూఎస్ఎస్‌బి తీర్పులోని 2(జె) వ్యాఖ్యానం ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాక, 1978నాటి ‘ట్రిపుల్ టెస్ట్’ మౌలిక సూత్రాలు కాలపరీక్షకు నిలిచిందని అంగీకరిస్తూనే, 2(జె) పరిధిని మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా దాన్ని భిన్నంగా రూపొందించి ఉండాల్సిందని సిజెఐ అభిప్రాయపడ్డారు. అయితే ఇది కేవలం తన ‘పరిశీలనాత్మక అభిప్రాయం’ మాత్రమేనని, పెండింగ్ కేసులను దీనితో ప్రభావితం చేయరాదని స్పష్టం చేశారు.
విభేదించిన న్యాయమూర్తులు
జస్టిస్ బివి నాగరత్న తీవ్రస్థాయిలో అసమ్మతి వ్యక్తం చేశారు. 1978 తీర్పుపై రిఫరెన్స్ ‘‘అనవసరమైనది’’, విచారణార్హం కాదని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో కార్మికుల హక్కులను కాపాడేందుకు ‘పరిశ్రమ’కు విస్తృత నిర్వచనం ఇప్పుడు మరింత అవసరమని ఆమె వాదించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేతుల్లోకి బదిలీ చేసే క్రమంలో ఉద్యోగుల రక్షణ కోసమే పారిశ్రామిక వివాదాల చట్టం అమల్లోకి వచ్చిందని, కేవలం ప్రభుత్వం ఒక కార్యకలాపంలో పాలుపంచుకుంటే మాత్రమే అది సార్వభౌమ విధిగా మారదని ఆమె స్పష్టం చేశారు. ‘‘జస్టిస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యానమే సరైన చట్టం’’ అని పేర్కొన్న ఆమె, 1978 తీర్పులోని 'డామినెంట్ నేచర్ టెస్ట్'ను సమర్థించారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కూడా జస్టిస్ నాగరత్న అభిప్రాయంతో ఏకీభవించారు. 1978 తీర్పుకు పునఃపరిశీలన అవసరం లేదని, ట్రిపుల్ టెస్ట్ కాలానుగుణంగా నిలదొక్కుకుందని తేల్చిచెప్పారు. ‘‘సందేహాలను శాశ్వతం చేయడంలో కాదు, తుది నిర్ణయాలను గౌరవించడంలోనే సంస్థాగత విశ్వసనీయత ఉంటుంది’’ అని జస్టిస్ దత్తా వ్యాఖ్యానించారు.







కామెంట్‌లు (0)