న్యూఢిల్లీ : భారత ఎన్నికల సంఘంలోని ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఏకాభిప్రాయం లేకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు సోమవారం ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. అయితే సిఇసిని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరిన పిటిషనర్ల అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
ఎన్నికల సంఘం స్పందనను పరిశీలించిన అనంతరం, ఇతర ఎన్నికల కమిషనర్ల అవసరమైన ఏకాభిప్రాయం లేకుండానే సిఇసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తేలితే, వాటిని పునఃపరిశీలించేందుకు లేదా ఉపసంహరించుకునేందుకు ఆదేశాలు ఇవ్వవచ్చని ధర్మాసనం సూచించింది. ఏకాభిప్రాయం లేకుండా నిర్ణయాలు తీసుకున్నట్లు నిరూపితమైతే ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు సంబంధించి ఎన్నికల సంఘం తీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. బహుళసభ్యుల రాజ్యాంగ సంస్థగా ఎన్నికల సంఘానికి సంక్రమించిన అధికారాలను, చట్టం నిర్దేశించిన సామూహిక నిర్ణయాధికార విధానాన్ని పాటించకుండా సిఇసి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వీటిపై సిఇసిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.








కామెంట్‌లు (0)