- ఆర్‌ఎస్‌ఎస్ నేత మోహన్ భగవత్‌కు అభిజీత్ దీప్కే హితవు
ఛత్రపతి సంభాజీనగర్ : ఆందోళన చేస్తున్న విద్యార్థులను ప్రత్యేకించి ‘జెన్ జి’ని దేశద్రోహులుగా పిలువరాదంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాటలను 'కాక్రోచ్ జనతా పార్టీ'(సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్వాగతించారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీకి, ఇతర బిజెపి నేతలకు చెప్పాలని సూచించారు. నిరసనలు తెలుపుతున్న విద్యార్థులను దేశద్రోహులని పిలవడం, ముద్రవేయడం వంటివి బిజెపి నాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలిపివేసేలా చొరవ తీసుకోవాలని భాగవత్‌ను కోరారు. ‘జెన్ జిని దేశద్రోహులుగా పిలవకూడదని మోహన్ భగవత్ పేర్కొన్నారు. నిరసన తెలపడం జెన్ జి హక్కు అని, వారి సమస్యల్లో వాస్తవం ఉందని ఆయన అన్నారు. కాబట్టి ఆయన మాటలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. అయితే, విద్యార్థుల ఆందోళనల చుట్టూ ఉన్న రాజకీయ ప్రభావాన్ని మార్చాలని, బిజెపి నాయకులకు, నరేంద్ర మోడికి ఇదే సందేశాన్ని తెలియజేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మోహన్ భగవత్.. బిజెపికి మార్గదర్శిగా, నరేంద్ర మోడీకి గాడ్‌ఫాదర్ లాంటివారు. వారు విద్యార్థులను, యువతను దేశద్రోహులుగా ముద్ర వేయడం ఆపాలి." అని అభిజీత్ దీప్కే అన్నారు. గతంలో పలువురు బిజెపి సీనియర్ నాయకులు విద్యార్థులపై అవమానకరమైన భాషను ఉపయోగించారని గుర్తు చేశారు. కేంద్ర విద్యాశాఖగా ఉన్నప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ నిరసన తెలుపుతున్న విద్యార్థులను 'ఉగ్రవాదుల బి-టీమ్' అని, అలాగే ప్రస్తుత బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ 'వైరస్' గా పేర్కొన్నారని గుర్తు చేశారు. బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా వెళ్లి, దానికి విరుద్ధంగా ఏమైనా మాట్లాడే అవకాశం లేదు కాబట్టి, ఇప్పుడైనా వారు మోహన్ భగవత్ మాట విని, ఆయన మాటలను పాటిస్తారని ఆశిస్తున్నట్లు దీప్కే తెలిపారు.
ఆ అధికారం పోలీసులకు లేదు ...
తాను ఎవరిని కలవాలో, ఎవరిని కలవకూడదో నిర్ణయించే అధికారం పోలీసులకు లేదని 'కాక్రోచ్ జనతా పార్టీ'(సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే వ్యాఖ్యానించారు. శుక్రవారం మహారాష్ట్రలోని తన నివాసం వద్ద గుమిగూడిన ప్రజలను పంపించే క్రమంలో పోలీసు అధికారికి, దీప్కేకు స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన దీప్కే, తాను ఎవరిని కలవాలో శాసించే అధికారం పోలీసులకు లేదని చెప్పారు. తన కోసం వచ్చిన ప్రజలను కచ్చితంగా కలుస్తానని తేల్చి చెప్పారు. ఆ అధికారిని "మీరు ఏ శాఖకు చెందినవారు? ఏ పోలీస్ స్టేషన్‌కు చెందినవారు? మీ హోదా ఏంటి?" అని దీప్కే సూటిగా ప్రశ్నించారు. తనను కలవడానికి వస్తుంటే పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని, "మీరు బయటకు వెళ్లండి" అని చెప్పి ఆ అధికారిని అక్కడి నుంచి పంపించారు. అలాగే, సదరు పోలీసు అధికారి సమాచారాన్ని పంచుకోవడానికి ఉపయోగిస్తున్న వాట్సాప్ గ్రూప్ పేరు 'స్ప్రే' అని ఉండటంపై దీప్కే అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీ పేరు కాక్రోచ్ కాబట్టి, ప్రజలను బొద్దింకలుగా భావించి పోలీసులు 'స్ప్రే' అనే పేరు పెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.







కామెంట్‌లు (0)