మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకులగణనలో ‘ఓపెన్‌ ఎండెడ్‌’ విధానాన్ని మార్చాలి

1 గంట క్రితం

rahul-1784436135.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 12:04 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కులాల పేర్లతో కూడిన డ్రాప్‌డౌన్‌ జాబితాను అందుబాటులోకి తేవాలి

  • ప్రధాని మోడీకి రాహుల్, ఖర్గే సంయుక్త లేఖ

​ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కులగణనలో వివరాల సేకరణ విధానంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి మంగళవారం ఇద్దరూ సంయుక్తంగా లేఖ రాశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ‘ఓపెన్‌ ఎండెడ్‌’ విధానాన్ని మార్చి, కులాల పేర్లతో కూడిన డ్రాప్‌డౌన్‌ జాబితాను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రస్తుత విధానంలో వ్యక్తులు తమ కులం పేరును ఎలా చెబితే అలా నమోదు చేస్తారని పేర్కొన్నారు. ఒకే కులానికి ప్రాంతాలను బట్టి వేర్వేరు పేర్లు, ఉపకులాలు, భాషా రూపాలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఒకే కులానికి చెందినవారి వివరాలు వేర్వేరు పేర్లతో నమోదైతే.. ఆ కులం వేలాది ఎంట్రీలుగా విడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా జరిగితే కులాల జనాభాపై కచ్చితమైన సమాచారం లభించదని తెలిపారు.

ఫలితంగా వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, ఇతర అణగారిన వర్గాల స్థితిగతులపై సరైన అంచనా సాధ్యం కాదన్నారు. విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయానికి సంబంధించిన నిర్ణయాలపై దీని ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశంలో ఒబిసిల వాస్తవ జనాభా ఎంత అన్నది కూడా తేలకపోవచ్చన్నారు. కులగణనలో ‘బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌’ అనే పదం చేర్చలేదని లేఖలో ప్రస్తావించారు. కులాల పేర్లతో డ్రాప్‌డౌన్‌ జాబితా రూపొందించాలని వారు సూచించారు. ఎస్‌‌సి, ఎస్‌‌టిల గణనలో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు.సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల ప్రభుత్వ జాబితాలు, ఆంథ్రోపాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వివరాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించవచ్చ పేర్కొన్నారు. తెలంగాణ, బీహార్‌ కుల సర్వేల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రశ్నావళిని రద్దుచేసి, రాజకీయ పార్టీలు, నిపుణులు, ప్రజలతో సంప్రదింపులు జరిపిన తరువాత కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్