- నిద్రలేని రాత్రులు గడిపాం
- అభిజిత్ దీప్కే తల్లిదండ్రులు
ఛత్రపతి సంభాజీ నగర్ (మహారాష్ట్ర) : దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులు, వారి కుటుంబాలలో ఆగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనివార్యమైన చర్య అని సిజెపి వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే తండ్రి భగవాన్‌రావ్ దీప్కే అన్నారు. ధరేంద్ర రాజీనామా నేపథ్యంలో అభిజిత్ నివాసం వద్ద స్థానిక ప్రజానీకం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా భగవాన్‌రావ్ మాట్లాడుతూ ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోయి ఉంటే, నిరసనల దిశ అనూహ్యంగా మారి ఉండేదన్నారు. ‘ధర్మేంద్ర రాజీనామా మంచి చర్య. ఎందుకంటే పిల్లలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు, వారి బంధువులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. అది రోజురోజుకీ పెరుగుతూ పోయింది. మొదట్లో అది జంతర్ మంతర్‌కే పరిమితమైంది. కానీ 20వ తేదీ తర్వాత అది దేశమంతటా వ్యాపించింది. కాబట్టి, ఆయన రాజీనామా చేయకపోయి ఉంటే, ఈ నిరసన ఏ దిశగా వెళ్లేదో ఎవరికీ తెలియలేదు’ అని తెలిపారు. తమ బిడ్డ ఉద్యమ శిబిరంలో కూర్చోవడం, పడుకోవడం, తినడం చూసి చాలా ఒత్తిడికి గురయ్యామని, నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపామని ఆయన అన్నారు. డెంగ్యూ, టైఫాయిడ్ వంటి తీవ్ర జ్వరాలు వచ్చినా తమ బిడ్డ పోరాటం కొనసాగించాడని, ఒక సందర్భంలో బలవంతంగానైనా ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నట్లు భగవాన్‌రావ్ తెలిపారు. 20 లాఠీచార్జి జరిగినప్పుడు రోజంతా ఏడుస్తూనే ఉన్నామని తెలిపారు. నిరసనల సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యామని, నిద్రలేని రాత్రులు గడిపానని అభిజీత్ దీప్కే తల్లి అనితా దీప్కే తెలిపారు. నిరసనలకు నాయకత్వం వహించడంలో తమ బిడ్డ పాత్ర పట్ల గర్వంగా ఉందన్నారు. చిన్న వయసులోనే ఇంతటి గొప్ప విజయాన్ని సాధించడం గర్వకారణమన్నారు. ‘చాలా సంతోషంగా ఉన్నాం. చాలా గర్వంగానూ ఉంది. అభిజిత్‌ను పోలీసులు కొడుతుంటే చాలా భయపడ్డాం. బిడ్డకు ఏమవుతోందనని ఆందోళన పడ్డాం. నిద్ర పట్టలేదు. ఏమీ తినాలని కూడా అనిపించేదికాదు. మా ఇద్దరికీ ఆకలి చచ్చిపోయింది. కానీ మా బిడ్డ అద్భుతమైన పని చేశాడు. మాకు చాలా గర్వంగా ఉంది," అని ఆమె అన్నారు.








కామెంట్‌లు (0)