బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మధ్యప్రదేశ్‌లో వేలాది మంది పెసర పంట రైతుల నిరసన

7 గంటల క్రితం

madhyapradesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 02:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రైతుల నిరసనలు చెపట్టారు. వేలాది మంది పెసర పంట రైతులు నిరసనకు దిగారు. సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో నర్మదాపురంలోని సేథానిఘాట్ వద్ద సోమవారం ధర్నాతో నిరసన ప్రారంభమైంది. మంగళవారం రైతులు ర్యాలీగా భోపాల్‌ చేరుకునేందుకు యత్నించారు. అయితే రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి -69పై పలు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. నర్మదాపురం జిల్లా మేజిస్ట్రేట్ సోమేశ్ మిశ్రా, పోలీసు సూపరింటెండెంట్‌లు నిరసనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నించారు. చర్చలు విఫలం కావడంతో.. వేలాది మంది రైతులు జాతీయ జెండాతో భోపాల్ చేరుకున్నారు. ఈ నిరసనలో ప్రధానంగా మూడు డిమాండ్లను రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.


రికార్డు స్థాయిలో పెసర ఉత్పత్తి చేసినప్పటికీ, మొత్తం పంటను కనీస మద్దతు ధర (ఎంఎస్పి) కు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో మధ్యప్రదేశ్‌లో సుమారు 14.30 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పెసర సాగు చేశారు. హెక్టారుకు సగటు దిగుబడి సుమారు 1,410 కిలోలు, కాబట్టి మొత్తం ఉత్పత్తి సుమారు 20.16 లక్షల మెట్రిక్ టన్నులు. సహజంగానే, ఇది రైతులకు సంతోషకరమైన విషయం. అయితే, రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేయడమే ఇప్పుడు వారి ఆందోళనకు కారణమైంది. ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్) కింద కేవలం 4.54 లక్షల మెట్రిక్ టన్నుల పెసర కొనుగోలుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంటే, ఉత్పత్తిలో ఎక్కువ భాగం ప్రభుత్వం సేకరించదు. ఫలితంగా, రైతులు తమ పంటలను బహిరంగ మార్కెట్లో తక్కువ ధరలకు విక్రయించవలసి వస్తుంది, ఇది ఎంఎస్పి కంటే చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో పంటను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, నిర్ణీత కోటాకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ టోకెన్‌ వ్యవస్థపై కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సేకరణ కేంద్రాల్లో తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఆన్లైన్ టోకెన్ బుకింగ్ తప్పనిసరి అయితే, ఈ వ్యవస్థ సంక్లిష్టంగా ఉందని, చాలా సందర్భాల్లో రిజిస్ట్రేషన్ తర్వాత కూడా తమ ఉత్పత్తులను విక్రయించడం సాధ్యం కావట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం... ఈ ఏడాది 3.47 లక్షల మంది రైతులు పెసర అమ్మకం కోసం నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు కేవలం 82 వేల మంది రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను ప్రభుత్వ కేంద్రాలకు విక్రయించగలిగారు. అంటే రిజిస్టర్డ్ రైతులలో 80 శాతం మంది ఇంకా ఎంఎస్పీ ప్రయోజనాన్ని పొందలేదు. వచ్చే విత్తనాల సీజన్‌కు ముందు సరసమైన ధరలకు ఎరువులు సకాలంలో సరఫరా అయ్యేలా చూడాలని రైతులు మరో డిమాండ్‌ చేస్తున్నారు. ఇది రైతుల మూడవ డిమాండ్‌. ఎరువులను పొందడంలో జాప్యం, అధిక ధరలు తీవ్ర సమస్యగా మారిందని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు.

మరోవైపు పెసర సేకరణ పరిమితిని 4.54 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 8.06 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరుతూ మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ఐదల్ సింగ్ కన్సానా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన కిందటి సంవత్సరాన్ని ఉదహరిస్తూ... తొలుత 4.19 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం కాగా, ఆ తర్వాత వాస్తవానికి 7.72 లక్షల మెట్రిక్ టన్నుల పెసరపప్పును సేకరించారు. గత సంవత్సరం ఇంత పెద్ద మొత్తాన్ని సేకరించడం సాధ్యమైతే, ఈ సంవత్సరం ఎందుకు సాధ్యంకాదు అని ఆయన వాదించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్