సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభూముల రక్షణ కోసం ‘సుప్రీం’ను ఆశ్రయించిన ఆదివాసీలు

53 నిమిషాల క్రితం

supreem
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:41 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 1/70 చట్టాన్ని నీరుగార్చొద్దు

  • గిరిజన భూములను రక్షించాలని విజ్ఙప్తి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : షెడ్యూల్డ్‌ ఏరియాల్లో తమ పూర్వీకుల భూములను అక్రమ ఆక్రమణలు, చట్టవిరుద్ధ భూ బదలాయింపుల నుంచి రక్షించుకునేందుకు 2,500 మంది ఆదివాసీ భూ యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గిరిజన భూముల పరిరక్షణకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రెగ్యులేషన్‌ (1/70)ను నీరుగార్చే ప్రయత్నాలను అడ్డుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అల్లంకి రమేష్‌ తెలిపారు. షెడ్యూల్డ్‌ ఏరియా భూములు కేవలం ఆర్థిక ఆస్తులు మాత్రమే కాదని, ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక గుర్తింపుతో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 244, ఆర్టికల్‌ 19(5), ఐదో షెడ్యూల్‌లోని పేరా 5, 5(2) ద్వారా కల్పించిన ప్రత్యేక రక్షణలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వర్ష రాంబాబు, ఆధార్‌ సొసైటీ సభ్యులు తదితరుల తరపున దాఖలైన పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రెగ్యులేషన్‌ (1/70) చట్టానికి ఉన్న రాజ్యాంగబద్ధతను ప్రస్తావించారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూముల బదలాయింపులను నియంత్రించడంతోపాటు, ఆదివాసీలను ఆర్థిక దోపిడీ నుంచి రక్షించడమే ఈ చట్టం ఉద్దేశమని పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పి. రామిరెడ్డి తదితరులు వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం (1988) 3 ఎస్‌‌సి 433 తీర్పులో పేర్కొన్న సూత్రాలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. షెడ్యూల్డ్‌ ఏరియాల్లో గిరిజనేతరులకు భూ బదలాయింపులపై విధించిన నిషేధం గిరిజనుల సామాజిక, ఆర్థిక మనుగడను రక్షించేందుకు ఉద్దేశించిందేనని పిటిషనర్లు పేర్కొన్నారు.

దోపిడీ నుంచి రక్షణ కోసమే ప్రత్యేక నిబంధనలు

చారిత్రకంగా గిరిజనులు పేదరికం, నిరక్షరాస్యత, చట్టపరమైన అవగాహన లేమి వంటి పరిస్థితులను ఎదుర్కొన్నారని పిటిషనర్లు తెలిపారు. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, గిరిజనేతర వలసదారులు భూములను స్వాధీనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల సమయంలో జరిగే బలవంతపు అమ్మకాలు, తక్కువ ధరలకు భూముల విక్రయాలు, నకిలీ పత్రాలు, వేలిముద్రలను దుర్వినియోగం చేయడం వంటి మార్గాలతో గిరిజన భూములు అన్యాక్రాంతమైనట్లు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్