పలువురికి గాయాలు
గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శీత్లామాత ఆలయం సమీపంలో యాత్రికులపైకి ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రక్కు దూసుకెళ్లడంతో 12 మంది మృతి చెందారు. పలువురు గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది.
చినోర్ వైపు నుంచి ధాన్యం లోడుతో వస్తున్న ట్రక్కు ఆలయం సమీపంలో అదుపుతప్పింది. బారికేడ్లను, ఆలయ ప్రధాన ద్వారాన్ని, గోడను ఢీకొట్టి యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు ట్రక్కు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నవరాత్రుల సందర్భంగా ఆలయానికి యాత్రికుల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ప్రమాదం జరిగిన మార్గంలో బారికేడ్లు, పోలీసు తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ట్రక్కు ఆ మార్గంలోకి ఎలా ప్రవేశించిందనే అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.








కామెంట్లు (0)