ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

త్రిపుర విద్యుత్‌ రంగంలో యథేచ్ఛగా దోపిడీ

1 గంట క్రితం

amani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 12:24 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ విమర్శ

అగర్తలా : త్రిపురలో విద్యుత్‌ ‌రంగం పట్టపగలే తీవ్రంగా దోపిడీకి గురవుతోందని, ఈ భారాన్ని సామాన్య ప్రజలే మోయాల్సి వస్తోందని సిపిఎం సీనియర్‌ ‌నాయకులు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ ‌సర్కార్‌ ‌విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్‌ ‌రంగ సంక్షోభంపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్‌ ‌సంక్షోభ పరిష్కారానికి కేవలం ప్రసంగాలు చేస్తూ, వాణిజ్య ప్రకటనలు జారీ చేయడానికి బదులుగా సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. రాష్ట్రంలో విద్యుత్‌ ‌సరఫరా క్షీణించడంపై ప్రశ్నించగా, త్రిపురకు ఎలాంటి విద్యుత్‌ ‌కొరత లేదని చెప్పారు. వామపక్ష సంఘటన ప్రభుత్వం అధికారంలో వున్న సమయంలో తాము నిరంతరంగా చేసిన కృషి కారణంగా దేశంలో మిగులు విద్యుత్‌ ‌కలిగిన రాష్ట్రాల్లో త్రిపుర ఒకటిగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఈశాన్య రాష్ట్రాలకు సరఫఱా చేసేవారమని, ఒక దశలో కేంద్రం, త్రిపురతో చర్చలు జరిపి, ఢిల్లీకి, ఉత్తరప్రదేశ్‌‌కు త్రిపుర విద్యుత్‌‌ను సరఫరా చేయించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో గత 8 ఏళ్ళ నుండి ఒక కిలోవాట్‌ ‌కొత్త విద్యుత్‌‌ కూడా జరగలేదని అన్నారు. ఇదీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే వున్న విద్యుత్‌ ‌సామర్ధ్యాన్ని కూడా సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. కానీ నేతలు చేసే ప్రసంగాలకు మాత్రం ఎలాంటి లోటు వుండడం లేదన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు బాధ్యత తీసుకుని సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేపట్టాలని సర్కార్‌ ‌కోరారు. విద్యుత్‌ ‌రంగంలో నెలకొన్న దోపిడీ, అవకతవకలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. సంకుచిత రాజకీయ కారణాలతో విద్యుత్‌ ‌కనెక్షన్‌ ‌తీసేసిన సంఘటనను ఉదహరించారు. బాధితులు, సాధారణ వినియోగదారులు పలు చోట్ల నిరసనలు తెలుపుతు న్నారని చెప్పారు. అయితే విద్యుత్‌ ‌కార్యాలయాలపై దాడులను వామపక్షాలు సహించబోవని స్పష్టం చేశారు. మాజీ విద్యుత్‌ ‌మంత్రి, వామపక్ష సంఘటన కన్వీనర్‌ ‌మాణిక్‌ ‌దేవ్‌ ‌కూడా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్‌ ‌మీటర్ల ముసుగులో వినియోగదారులను లూటీ చేస్తన్నారని, వారి నుండి బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజా ధనంతో నిర్మించుకున్న విద్యుత్‌ ‌కార్పొరేషన్‌‌ ఆస్తులను ప్రైవేటు ప్రయోజనాలకు క్రమంగా ధారాదత్తం చేసే వ్యూహంలో భాగమే ఈ స్టార్ట్‌ ‌మీటర్ల బిగింపు అని దేవ్‌ ‌విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్