- జెపిఎస్‌సి పరీక్షల ఆక్రమాలపై ఆగ్రహం
- మద్దతుగా నిలిచిన సిజెపి
రాంచీ : జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జెపిఎస్‌సి), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జెఎస్‌ఎస్‌సి) పరీక్షల్లో అక్రమాలు జరిగాయని రాంచీలో గత వారం రోజుల నుండి విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. పోటీ పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, పరిక్షలో జరిగిన అవకతవకలపై సిబిఐ దర్యాప్తు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగింది?
ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో103 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జెపిఎస్‌సి) నోటిఫికేషన్ జారీ చేసి అనంతరం ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరిక్షా ఫలితాలను జులైలో విడుదల చేసింది. అయితే, కటాఫ్ మార్కులను ప్రకటించలేదు. దీంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. అలాగే ఒఎంఆర్ షీట్లకు సంబంధించి అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గత నెలలో జరగాల్సిన మెయిన్ పరీక్షతో పాటు, మరో తొమ్మిది పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నామని జెపిఎస్‌సి ప్రకటించింది. ఈ నిర్ణయంతో వందలాది పోస్టుల భర్తీ నిలిచిపోయింది. దీంతో ఆగ్రహించిన నిరుద్యోగులు 'క్లీన్ జెపిఎస్‌సి' పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు. పరిక్షలో జరిగిన అక్రమాలపై సిబిఐతో దర్యాప్తు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సిజెపి మద్దతు..
రాంచీలో నిరుద్యోగుల ఆందోళనలకు సిజెపి ఆదివారం మద్దతు తెలిపింది. ఈ మేరకు సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘జెపిఎస్‌సి, జెఎస్‌సి నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు సిజెపి మద్దతుగా నిలుస్తుంది. నిరసన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడాను. వారి డిమాండ్లకు మద్దతు ఇస్తున్నాం.’’ అని సోషల్ మీడియాలో దీప్కే తెలిపారు. ఈ వ్యవహారంలో గోడ్డా జిల్లా బ్లాక్ సప్లై ఆఫీసర్ అభయ్ తివారీని పోలీసలు అరెస్టు చేశారు. పరిక్షను నిర్వహించిన టిడిపిఎల్ ఏజెన్పీనీ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. అంతేకాకుండా జెపిఎస్‌సి మాజీ చైర్మన్, జార్ఖండ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్. ఖియాంగ్టేను సిఐడి మూడు రోజుల పాటు విచారించింది. దీనికి ముందు, ఆయన గత నెలలో రాజీనామా చేశారు. అయితే ఢిల్లీ జంతర్ మంతర్‌లో నీట్ విద్యార్థులపై పోలీసులతో దాడి చేయించిన బిజెపి జార్ఖండ్‌లో పరిక్ష అవకతవలపై ఉద్యమాలు చేయడం గమనార్హం.








కామెంట్‌లు (0)