ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం

06 సెప్టెంబర్, 2026

adivadi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 10:54 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఎఎఆర్‌ఎం జాతీయ సదస్సు పిలుపు

- అటవీ హక్కుల చట్టం, పీసా సమర్థ అమలుకు డిమాండ్‌

- జల్, జంగల్‌, జమీన్‌పై ఆదివాసీల హక్కులు కాపాడాలి

- జ‌స్టిస్ మ‌ద‌న్ బి లోకూర్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఎఎఆర్‌ఎం) జాతీయ సదస్సు పిలుపునిచ్చింది. ఆదివాసీల హక్కులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్ప‌ష్టం చేసింది. ఆదివారం నాడిక్క‌డ‌ జివి మావలంకర్ హాల్‌లో ‘ఆదివాసీ హ‌క్కుల కోసం పోరాటం’ జాతీయ సదస్సు జ‌రిగింది. ఈ స‌ద‌స్సులో అభివృద్ధి ప్రాజెక్టులు, మైనింగ్ కార్యకలాపాల వల్ల ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న విస్థాపన, పునరావాస సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఆదివాసీల జీవనాధారమైన జల్‌, జంగల్‌, జమీన్‌పై వారి హక్కులను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత అని ప్రతినిధులు స్పష్టం చేశారు. అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ), పంచాయతీలకు విస్తరించిన షెడ్యూల్డ్ ప్రాంతాల చట్టం (పీసా)ను సమర్థంగా అమలు చేయాలని సదస్సు డిమాండ్ చేసింది.

సద‌స్సును ప్రారంభిస్తూ.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ మాట్లాడుతూ.. చ‌ట్టాలు అమల్లో ఉన్నప్పటికీ ఆదివాసీలకు భూమి, అడవులు, సహజ వనరులపై కల్పించిన హక్కులు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామసభల అధికారాలను పక్కనపెట్టడం వల్ల ఆదివాసీల హక్కులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఖనిజ వనరుల పేరుతో ఆదివాసీలను వారి భూముల నుంచి తరలించే చర్యలను నిలిపేయాలన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలి

ఆదివాసీ యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని సదస్సు కోరింది. ఆదివాసీ సమాజాల గుర్తింపు, సంస్కృతి, భాష, సంప్రదాయాలు, విశ్వాసాలను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను సదస్సు దృష్టికి తీసుకొచ్చారు. ‘నీరు, అడవి, భూమి, విద్య, ఉద్యోగం, సంస్కృతి, గుర్తింపు’ వంటి అంశాల‌ను నేతలు, ప్ర‌తినిధులు లేవ‌నెత్తారు. ఉపాధి రంగంలో రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పాల్గొన్న ప్రతినిధులు విమర్శించారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ క్షీణించడం, ఆదివాసీలు ఎదుర్కొంటున్న వివక్షపై వారు తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తం చేశారు.

ఖనిజ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన

ఖాన్‌ అండ్‌ మినరల్స్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు-2026ను ఉపసంహరించుకోవాలని సదస్సు డిమాండ్ చేసింది. దీనికి వ్యతిరేకంగా సోమవారం నాడు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎఎఆర్ఎం ఛైర్మన్‌ జితేంద్ర చౌదరి తెలిపారు. దేశవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యారంగ పరిస్థితులపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స మాట్లాడారు. సదస్సుకు కన్వీనర్‌ పులిన్‌ బాస్కీ, సిపిఎం సీనియర్‌ నాయకురాలు బృందా కరత్‌, ఎఎఆర్ఎం వైస్ ఛైర్మ‌న్‌ మిడియం బాబూరావు, ఆంధ్ర ప్రదేశ్‌ నేతలు కిల్లో సురేంద్ర, లోతా రామారావు, ఎస్‌.ధర్మాన పడాల్‌, పి.బాలదేవ్‌, రామ‌కృష్ణ, తెలంగాణ నేతలు స‌చిన్‌, బండారు ర‌వికుమార్‌, గంగా, ధ‌ర్మానాయ‌క్‌ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, అస్సాం, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, బీహార్ తదితర 18 రాష్ట్రాల ప్రతినిధులు, హక్కుల కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రధాన డిమాండ్లు

  • అటవీ హక్కుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలి

  • గ్రామసభల అధికారాలను పరిరక్షించాలి

  • రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌, పీసా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

  • ఆదివాసీల విస్థాపనను అడ్డుకోవాలి

  • జల్‌, జంగల్‌, జమీన్‌పై ఆదివాసీల హక్కులను కాపాడాలి

  • ఆదివాసీ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు పెంచాలి

  • భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలి

  • ఖాన్‌ అండ్‌ మినరల్స్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు-2026ను ఉపసంహరించాలి

  • ఆదివాసీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి

  • ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ వెంటనే భర్తీ చేయాలి

  • ఆదివాసీల విద్య కోసం బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్