- మహిళ మృతి, భర్త, కుమారుడికి తీవ్రగాయాలు
ఇంఫాల్ : మణిపూర్‌లో ఏళ్లు గడుస్తున్నా.. హింసాకాండ ఆగడం లేదు. రాష్ర్టంలో తాజాగా చెలరేగిన హింసాకాండలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె భర్త, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. టమెంగ్‌లాంగ్ జిల్లాలో జాతీయ రహదారి-37కు అనుకుని ఉన్న టోలెన్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఒక కుటుంబంపై కాల్పులు జరపడంతో లింగ్జాంగై సింగ్సిట్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త సెయినెహ్ సింగ్సిట్, వారి ఆరేళ్ల కుమారుడు గాయపడ్డారు. సింగ్సిట్ మరో ఇద్దరు పిల్లలు తప్పించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న కైమై అస్సాం రైఫిల్స్ సిబ్బంది, గాయపడిన తండ్రి, కుమారుడిని తక్షణ వైద్య చికిత్స కోసం జిరిబామ్‌కు తరలించారు. ఈ దాడితో జాతీయ రహదారి-37కు సమీపంలో ఉన్న గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ఈ జాతీయ రహదారి మణిపూర్ రాజధాని ఇంఫాల్‌ను జిరిబామ్‌తో అనుసంధానిస్తుంది.
సమగ్ర దర్యాప్తు జరిపి, దోషులను శిక్షించాలి
ఈ ఘటనను కుకీ యూత్ ఆర్గనైజేషన్ (కెవైఓ) మహిళా మండలి తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై తక్షణమే నిష్పక్షపాతంగా, సమగ్రంగా దర్యాప్తు జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. భద్రతా దళాలు మోహరించిన ప్రాంతానికి కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఈ దాడి ఎలా జరిగిందని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.








కామెంట్‌లు (0)