ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రష్యా ముడిచమురు కొనుగోళ్ళపై ఆంక్షలు రద్దు చేసిన అమెరికా..

8 గంటల క్రితం

రష్యా ముడిచమురు కొనుగోళ్ళపై ఆంక్షలు రద్దు చేసిన అమెరికా
- జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమన్న ట్రంప్
- భారత్‌కు ఉపశమనం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 10:03 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమన్న ట్రంప్

- భారత్‌కు ఉపశమనం

వాషింగ్టన్: రష్యా ముడి చమురు, సహజ వాయువును అత్యధికంగా కొనుగోలు చేసే దేశాలపై 100శాతం వరకు సుంకాలు (టారిఫ్‌లు) విధించేందుకు వీలు కల్పించే చట్ట నిబంధనల అమలుకు మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. ఈ సుంకాలు ఆదివారం (18వ తేదీ) నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అమెరికన్ కాంగ్రెస్‌కు కూడా తెలియజేశారు. రష్యా డీజిల్ దిగుమతులను అమెరికాకు అనుమతించిన ఆరు రోజుల తర్వాత ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.

​భారత్‌కు ఊరట

ఈ చర్యతో భారత చమురు దిగుమతులకు ఊరట లభించనుంది. పెండింగ్‌లో ఉన్న భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కూడా వేగవంతమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ప్రధానంగా రష్యన్ చమురుపై ఆధారపడటం పెరిగింది. జులైలో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా 50 శాతం దాటింది. ఆగస్టు నాటికి అది 44 శాతానికి తగ్గింది.

ఇటీవలి కాలంలో డీజిల్, పెట్రోల్ (గ్యాసోలిన్) ధరలు పెరుగుతున్నాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ మినహాయింపు ఆ దేశానికి చాలా కీలకమైనది. ఈ నేపథ్యంలోనే రష్యన్ డీజిల్ దిగుమతిపై ఒప్పందాన్ని ట్రంప్ ఈ నెల 10న ప్రకటించారు. అంతర్జాతీయంగా డీజిల్ ధరలను తగ్గించేందుకే ఈ ఒప్పందమని ఆయన చెప్పారు. ‘‘అమెరికన్లకు, ముఖ్యంగా మా రైతులకు, ట్రక్కర్లకు తక్కువ ధరలకే డీజిల్ అందేలా చూడటమే మా అత్యున్నత ప్రాధాన్యం’’ అని ఆయన సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టారు. పశ్చిమాసియా నుంచి డీజిల్ ఎగుమతులకు అంతరాయాలు కొనసాగడం, రష్యా సహా కొన్ని ఆసియా దేశాల నుంచి సరఫరాలు తగ్గడం వల్ల ఈ ఏడాది రెండో అర్ధభాగంలో అంతర్జాతీయ డీజిల్ లభ్యత రోజుకు 15 లక్షల బ్యారెళ్ల మేర పడిపోయిందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఎ) తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్